Sangareddy : పుట్టిన నిమిషాల్లోనే శిశువు కిడ్నాప్ - ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
10 October 2024, 6:36 IST
- పుట్టిన నిమిషాల్లోనే శిశువు కిడ్నాప్ కు గురి కావటం సంచలనంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
పుట్టిన నిమిషాల్లోనే శిశువు కిడ్నాప్..!
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆడ శిశువు పుట్టిన నిమిషాల్లోనే కిడ్నాప్ కు గురైంది. ఈ ఘటన బుధవారం స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దుదిగొండ గ్రామానికి చెందిన నజీమా, అబ్బాస్ అలీ దంపతులు. కాగా నజీమా కు పురిటి నొప్పులు రావడంతో కాన్పు కోసం మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె బుధవారం తెల్లవారుజామున ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం కాసేపటికే పసికందు కనిపించకుండా పోయింది. ఈ విషయం గమనించిన శిశువు తల్లితండ్రులు, ఆసుపత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించారు. నజీమా సిజేరియన్ సమయంలో అక్కడ ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. అయితే ఆ ముగ్గురు మహిళలపై శిశువు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బృందాలుగా ఏర్పడి ఆ మహిళల కోసం గాలిస్తున్నారు.
మెదక్ లో రోడ్డు ప్రమాదం :
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లిన వ్యక్తి పండగ కోసం స్వగ్రామానికి ఎంతో సంతోషంగా బైక్ పై బయలుదేరాడు. మార్గమధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిలిపిచేడ్ మండలం రామక్కపేట గ్రామానికి చెందిన చీమల లక్ష్మయ్య (45) భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం మూడు సంవత్సరాల క్రితం గండిమైసమ్మ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
దసరా పండగ సందర్భంగా ఊరికి వెళ్లేందుకు సోమవారం రాత్రి లక్ష్మయ్య ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో మొండితండా సమీపంలోకి రాగానే అతడు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. అక్కడ గమనించిన తండావాసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాధితుడిని వెంటనే ఆటోలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కుటుంబ పెద్ద మరణంతో భార్య, పిల్లలు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య :
ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నర్సాపూర్ మండలం బాహ్మణపల్లి గ్రామానికి చెందిన గుండే కర్ణాకర్ (45) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో సంవత్సరం క్రితం పెద్ద కూతురు వివాహం చేశాడు. పెళ్ళికి చేసిన అప్పులు ఎలా తీర్చాలని తరచూ ఆవేదన చెందేవాడు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. మృతుడి భార్య సంతోష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపాడు.