తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Group 3 Exams : రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు

Group 3 Exams : రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు

HT Telugu Desk HT Telugu

16 November 2024, 22:19 IST

google News
  • Group 3 Exams : తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా1401 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1375 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ శ్రీజ పర్యవేక్షించారు.

రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు
రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు

రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు- హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు

తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్‌-3 పరీక్షలకు దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాలలో 1375 పోస్టులు రేపు, ఎల్లుండి నియామక పరీక్ష జరగనుంది. ఆదివారం రెండు పేపర్లు, సోమవారం ఒక పేపర్ కు పరీక్ష నిర్వహించనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూప్ - 3 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో పరీక్షా కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ పర్యవేక్షించారు. అలాగే భద్రాద్రి జిల్లాలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం జిల్లాలో గ్రూప్ -3 పరీక్షలను సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ పేర్కొన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ఆది, సోమ వారాల్లో నిర్వహించనున్న గ్రూప్ -3 పరీక్షా కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు. చింతకాని మండలం రామకృష్ణాపురంలోని సెంట్ థెరిస్సా పాఠశాల, ఖమ్మం విన్ ఫీల్డ్ పాఠశాల, ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని దరిపెల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పెద్దతండా లోని ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లలో పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా పరీక్షను నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమాచారం, సహాయం కావాలన్నా వెంటనే ప్రాంతీయ కో-ఆర్డినేటర్ల దృష్టికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.

పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, శాఖాధికారులు, రూట్ అధికారులు, రీజనల్ కో ఆర్డినేటర్ లతో సమన్వయంతో ఉండాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోని ప్రతి హాల్ లో 24 మంది అభ్యర్థులకు సీటింగ్ అరేంజ్మెంట్, నిబంధనల మేరకు చేయాలని సూచించారు. కిటికీలు, కాంపౌండ్ వాల్ ల వద్ద ఎలాంటి తప్పులు జరగకుండా భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. కిటికీల వద్ద, పరీక్షా హాళ్లలో ఉన్న చెత్త, స్టడీ మెటీరియల్, పోస్టర్లు పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. పరీక్షా కేంద్రానికి కేటాయించిన అభ్యర్థుల సంఖ్య మేరకు కావాల్సిన ప్రిస్కింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి అభ్యర్థిని పక్కగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతించాలని పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. అభ్యర్థికి కేటాయించిన గది నెంబర్, త్రాగునీరు, టాయిలెట్లు, పరీక్ష హాల్స్ ఎక్కడ ఉన్నాయో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వివరించారు. నవంబర్ 17 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5-30 వరకు రెండు సెషన్లు, నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

27 వేల పైచిలుకు అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో మొత్తం 27 వేల 984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 87 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8-30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1-30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల గేటు ఉదయం 9-30 గంటలకు, మధ్యాహ్నం 2-30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్షా కేంద్రంలోకి ఎవ్వరిని అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తమ వెంట బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫోటోతో కూడిన హాల్ టికెట్, ప్రభుత్వంచే జారీ చేసిన ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ తీసుకుని రావాలని తెలిపారు. హాల్ టికెట్ లో ఫోటో సరిగ్గా లేకపోతే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గెజిటెడ్ అధికారి లేదా చివర చదివిన విద్యా సంస్థ ప్రిన్సిపల్ సంతకంతో తీసుకువచ్చి పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్ కు అప్పగించాలన్నారు.

పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్, పేజర్స్, సెల్ఫోన్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజెస్, వాచ్, మాథమేటికల్ టేబుల్, లాగ్ టేబుల్, హ్యాండ్ బ్యాగ్స్, జోలాస్, పౌచెస్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్, జువెలరీ (మంగళసూత్రం, గాజులు సంబంధ ఐటెంలు మినహాయించి), ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలగు సామాగ్రి తీసుకుని రావడానికి వీల్లేదని, చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని అన్నారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ వ్యాలీడ్ కాదని, బయో మెట్రిక్ విధానం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, టాటూ వంటివి పెట్టుకోవద్దని అన్నారు. ప్రతి పేపర్ సమయంలో అభ్యర్థి ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్ టికెట్ పై సంతకం పెట్టాలని అన్నారు. ఓఎంఆర్ షీట్ ను సరిగా చెక్ చేసుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ విడిచి వెళ్ళుటకు వీలులేదన్నారు. నిబంధనలు పాటిస్తూ, సజావుగా పరీక్షల నిర్వహణకు సహకరించాలని అన్నారు

భద్రాద్రి జిల్లాలో

ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో జరుగునున్న గ్రూప్-3 కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని 26 పరీక్ష కేంద్రాలు, పాల్వంచలోని 13 పరీక్షా కేంద్రాలు మొత్తం 39 కేంద్రాల వద్ద సుమారుగా 350 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 గంటలకు పరీక్ష జరగనుంది. మళ్లీ సోమవారం 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షా సమయాన్ని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 13,478 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

👉 పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలు లోపు, మధ్యాహ్నం అయితే 14.30 గంటల లోపు హాజరు కావాలి. నిర్దేశించిన సమయాలకు పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్లను మూసివేయడం జరుగుతుంది.

👉 అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకుని రాకూడదు.

👉 అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

👉 మంటను ప్రేరేపించే వస్తువులను గాని, ఇంకు బాటిల్స్ అనుమతి లేని ఏ ఇతర వస్తువులను తమ వెంట తీసుకురాకూడదు.

👉 మాల్ ప్రాక్టీస్ నకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

👉 తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

👉 గ్రూప్-3 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి అపోహలకు, ఆందోళనకు గురికాకుండా పరీక్షకు హాజరుకావాలని కోరారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

తదుపరి వ్యాసం