తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Budget: ఆర్నెల్లలో తెలంగాణకు రూ.35వేల కోట్లు అప్పులు తెస్తే రూ.42వేల కోట్లు తీర్చామన్న భ్టట్టి విక్రమార్క

Telangana Budget: ఆర్నెల్లలో తెలంగాణకు రూ.35వేల కోట్లు అప్పులు తెస్తే రూ.42వేల కోట్లు తీర్చామన్న భ్టట్టి విక్రమార్క

Sarath chandra.B HT Telugu

25 July 2024, 13:16 IST

google News
    • Telangana Budget: తెలంగాణలో 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2.91లక్షల కోట్ల వార్షిక   బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. తెలంగాణలో బడ్జెట్‌లో రెవిన్యూ వ్యయం రూ.2.20లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.33,487కోట్లుగా పేర్కొన్నారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్‌ ప్రతులతో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్షిక బడ్జెట్‌ ప్రతులతో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ ప్రతులతో భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి

Telangana Budget: తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. "నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే స్వప్నాన్ని సాకారం చేసిన సోనియాగాంధీకు కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 సంవత్సరానికి రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను సభ ముందు ఉంచారు.

తెలంగాణ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా పేర్కొన్నారు. సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.. సంక్షేమానికి రూ.40 వేల కోట్లను కేటాయించారు.

శాఖల వారీగా కేటాయింపులు చూస్తే హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు, విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ప్రజా పంపిణీకి రూ.3,836 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు కేటాయించారు.

ఐటీ శాఖకు రూ.774 కోట్లు, 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.. అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు, మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు, రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లను కేటాయించారు.

తెలంగాణ అకాంక్ష నెరవేర్చాం….

తెలంగాణ ప్రజల అకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్లలో తెలంగాణలో ఆశించిన పురోభివృద్ధి జరగలేదని భట్టి పేర్కొన్నారు. గత పాలకులకు ఉత్తమకుమార ప్రగల్భాలు పలికి అన్ని రంగాల్లో విఫలమయ్యారని భట్టి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

రాష్ట్రం అప్పుల పాలైందని, రూ.75వేల కోట్ల అప్పులతో మొదలై గత ఏడాది నాటికి రూ. 6.71లక్షల కోట్లకు అప్పులు చేరాయని, పదేళ్లలో పది రెట్లు అప్పులు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు,నిధులు, ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రంలో ఎంత వరకు నెరవేరాయో అంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.35వేల కోట్లను అప్పులు చేసిందని, అదే సమయంలో రూ.42వేల కోట్లను గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీల రూపంలో చెల్లించిందని చెప్పారు. చేసిన అప్పుల కంటే రూ.7వేల కోట్లను అధికంగా అప్పులు తీర్చడానికి తమ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. దాంతో పాటు రూ.34వేల కోట్ల రుపాయల్నిఎన్నికల హామీల అమలుకు ఖర్చు చేసినట్టు చెప్పారు.

నాణ్యతలేని నిర్మాణాలు…

తప్పుడు విధానాలతో తెలంగాణలో నాణ్యత లేని నిర్మాణాలతో సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ప్రయోజనాలను ఇవ్వలేకపోయాయని చెప్పారు. రైతులకు ప్రయోజనం కల్పించలేదని, సాగునీటి రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో సమకూరిన ఆదాయానికి, బకాయిలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోయిందన్నారు. ప్రణాళిక లేకుండా నడపడం, సొంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో వారసత్వంగా సమస్యలు అందుకున్నామన్నారు. విభజన నాటికి ఆర్థిక పరిపుష్టితో ఉన్న రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించలేని స్థితి చేరిందన్నారు.

ఆదాయంలో హెచ్చు తగ్గులు…

ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సిలిండర్‌, రైతు రుణ మాఫీ వంటి ఎన్నికల హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేశామని భట్టి విక్రమార్క చెప్పారు.తెలంగాణలో తలసరి ఆదాయం అధికంగా ఉన్నా, తలసరి ఆదాయ స్థాయిలో జిల్లా స్థాయిల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, రంగారెడ్డి రూ.9.62లక్షలు ఉంటే వికారాబాద్‌లో లక్షన్నర మాత్రమే ఉందన్నారు.

రైతులకు రూ.2లక్షల రుణమాఫీకి కాంగ్రెస్‌ కట్టుబడి ఉన్నామని, వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, రుణమాఫీ నిధులు సమీకరించాలనే సంకల్ప బలం తమకు ఉందన్నారు. 2014-18 మధ్య నాలుగు విడతల్లో రూ.లక్ష మాత్రమే విడుదల చేశారని, దాని వల్ల వడ్డీ భారం పెరిగిందన్నారు. రెండోసారి లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు కొద్దిపాటి రుణాలు మాత్రమే మాఫీ చేశారన్నారు. దీని వల్ల రైతులపై తీవ్రమైన భారం పడిందన్నారు. అరకొర రుణమాఫీ కాకుండా రైతులకు ఒకేసారి రూ.31వేల కోట్లను రుణమాఫీ చేశామని చెప్పారు. రుణమాఫీ అమలు చేస్తున్నా కాంగ్రెస్‌ చిత్తశుద్దిని శంకిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

పొదుపు, ప్రణాళికతో, రెండు లక్షల కోట్ల రుణమాఫీ అవసరమైన నిధులు సమీకరిస్తున్నామని, 11.34లక్ష మంది రైతులకు జూలై 18న రూ.6వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అది శిలాశాసనమేనని చెప్పారు.

గత ప్రభుత్వంలో అనర్హులకు మాత్రమే రుణమాఫీ చేశారని, దాని వల్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యిందని, అర్హులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో రైతు బంధు స్థానంలో రైతు భరోసా రూపంలో ఏటా రూ.15వేలు చెల్లిస్తామని, దాని అమలుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి వాటిని సభలో చర్చించి విధివిధానాలను ఖరారు చేస్తామని ప్రకటించారు.

ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికిఉపయోగిస్తోంది. పథకానికి అయ్యే ఖర్చును నెలవారీగా చెల్లిస్తోంది. మిలియన్ డాలర్ కార్పొరేషన్‌గా తెలంగాణ ఆర్టీసీ అవతరించింది. గ్యాస్‌ సిలిండర్‌తో తీవ్ర ఆర్థిక సమస్యగా మారితే,మహాలక్ష్మీ పథకంతో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ అందించామని, 30.06లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరిందని, బడ్జెట్‌లో రూ.723కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.200కోట్లు కేటాయించినట్టు భట్టి విక్రమార్క చెప్పారు.

ఎస్టీ తాండాలు, గూడెలకు బీటీ రోడ్లను నిర్మిస్తామని భట్టి ప్రకటించారు. 500మందికి మించి జనాభా ఉన్న నివాస ప్రాంతాలను పంచాయితీలుగా గుర్తించినా సదుపాయలు లేవని, తమ ప్రభుత్వం వాటికి పంచాయితీ కార్యాలయాలు, రోడ్లను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. 

బీఆర్‌ఎస్‌ ఎద్దేవా..

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా బడ్జెట్‌ ప్రతుల్ని ముఖ్యమంత్రికి ఆఱ్థిక మంత్రి అందిస్తున్నవీడియోను పాత వీడియోలతో కలిపి బీఆర్‌ఎస్‌ ట్వీట్ చేసింది. బ్యాగ్ పట్టుకోగానే ముసిరిన జ్ఞాపకాలు అంటూ పేర్కొంది.

తదుపరి వ్యాసం