Telangana Tourism : ఈ వీకెండ్ లో 'సాగర్' చూసొద్దామా..! జస్ట్ 800కే వన్ డే టూర్ ప్యాకేజీ - వివరాలివే
12 September 2024, 15:49 IST
- కృష్ణమ్మకు భారీ వరద తరలిరావటంతో నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాలను చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే మీరు కూడా ఈ వీకెండ్ లో సాగర్ చూడాలనుకుంటే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వివరాలు ఇక్కడ చూడండి…
సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
తక్కువ ధరలోనే మంచి టూరిస్ట్ ప్రాంతాలకు తెలంగాణ టూరిజం పలు రకాల ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఏపీ, తెలంగాణే కాకుండా మిగతా రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అయితే తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు సమీపంలో ఉన్న ప్లేసులను చూసేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి సాగర్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది. అంతకంటే ముందుగానే టూరిస్టులు బుకింగ్ చేసుకోవాలి. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సాగర్ ప్యాకేజీ వివరాలు:
- 'Nagarjuna sagar Tour ' పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
- హైదరాబాద్ నుంచి బస్సులో(నాన్ ఏసీ కోచ్) వెళ్తారు.
- ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800గా నిర్ణయించారు. ఇక చిన్న పిల్లలకు చూస్తే రూ. 640గా ఉంది.
- ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఇదే బస్సు 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.
- ఉదయం 11:40 గంటలకు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సందర్శిస్తారు.
- ప్రస్తుతం ప్రాజెక్ట్ అంతా కూడా నిండిపోయి ఉంది. వరద తీవ్రతను బట్టి గేట్లను ఎత్తుతున్నారు. మీరు వెళ్లే సమయానికి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే గేట్లను ఎత్తుతారు.
- సాయంత్రం 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ వన్ డే టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
- హైదరాబాద్ - సాగర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/package/nagarjunasagartour
సాగర్ బ్యాక్ వాటర్ కేరాఫ్ వైజాగ్ కాలనీ :
మరోవైపు సాగర్ కు అతిసమీపలో ఉండే వైజాగ్ కాలనీకి చాలా మంది టూరిస్టులు వెళ్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి అతి దగ్గర సమీపంలో ఉంటుంది వైజాగ్ కాలనీ. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు సమీపంగా ఈ టూరిజం స్పాట్ ఉంటుంది.
నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది. గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇక్కడ ఉంటుంది. చుట్టు కొండలు ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే,,, ఐల్యాండ్ అని అనొచ్చు. ఇక్కడికి టూరిస్టులు చాలా మంది వస్తుంటారు.
సాగర్ హైవేపై ఉండే మల్లేపల్లి నుంచి 32 కి.మీ. దూరంలో ఈ వైజాగ్ కాలనీ ఉంటుంది. ఇక్కడ నైట్ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. విశాఖ జిల్లా నుంచి వచ్చిన మత్స్యకారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వీకెండ్ లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఈ ప్లేస్ ను ఎంచుకోవచ్చు.