Reels competition: రీల్ పెట్టు... అవార్డు కొట్టు - తెలంగాణ అటవీశాఖ బంపర్ ఆఫర్
15 June 2023, 15:53 IST
- Telangana State Forest Dept: రీల్స్ చేసే వారికి ఓ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ అటవీ శాఖ. పచ్చదనం ప్రాధాన్యతను వివరిస్తూ రీల్స్ చేసి అవార్డులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించింది.
Reels competition
Telangana State Forest Department: మీరు రీల్స్ చేస్తారా...? వీడియోలు.. రీల్స్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తుంటారా..? అయితే మీలాంటి వారికి అదిరిపోయే న్యూస్ చెప్పింది తెలంగాణ అటవీశాఖ. దశాబ్ధి ఉత్సవాల వేళ... హరితహారం, పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తూ రీల్స్, వీడియోస్ చేసి పంపితే వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని అటవీశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
రాష్ట్ర అవతరణ సందర్భంగా... ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా 21 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే జూన్ 19వ తేదీన హరితోత్సవం నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే పచ్చదనం ప్రాముఖ్యత, హరితహారాన్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నిమిషం నిడివి ఉండేలా రీల్స్, వీడియోలను ఆహ్వానించింది. ఇందులో బెస్ట్ గా ఉండే వాటిని ఎంపిక చేసి అవార్డులను అందజేస్తామని ప్రకటించింది. ఇక నెటిజన్లు చేసే రీల్స్ కానీ వీడియోలను tkhh2023@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.
దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి. మిగతా కార్యక్రమాలు చూస్తే....
• జూన్ 17
జూన్ 17వ తేదీ శనివారం ‘‘తెలంగాణ గిరిజనోత్సవం’’ జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.
• జూన్ 18
జూన్ 18వ తేదీన ఆదివారంనాడు ‘‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’’ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.
• జూన్ 19
జూన్ 19వ తేదీ సోమవారం ‘‘తెలంగాణ హరితోత్సవం’’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
• జూన్ 20
జూన్ 20వ తేదీ - మంగళవారం ‘‘తెలంగాణ విద్యాదినోత్సవం’’ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.
• జూన్ 21
జూన్ 21వ తేదీ బుధవారం ‘‘ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’’ నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.
• జూన్ 22
జూన్ 22వ తేదీ గురువారం ‘‘అమరుల సంస్మరణ’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.