Bathukamma Festival : జానపదుల ఆట పాటలతో బతుకమ్మ- ఇదీ చారిత్రక నేపథ్యం!
14 October 2023, 17:35 IST
- Bathukamma Festival : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ... శనివారంతో మొదలుకానుంది. బతుకమ్మ పండుగ ఎలా మొదలైంది? చరిత్ర ఏం చెబుతోంది?
బతుకమ్మ పండుగ
Bathukamma Festival : తెలంగాణ ప్రజలు, ఆ మాటకొస్తే దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ మహిళలు ఎంతో సంతోషంగా సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. శనివారం ఎంగిలి పూవు బతుకమ్మ మొదలు కానుంది. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగను నిర్వహిస్తోంది. ప్రపంచమంతా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా ఈ పండుగ జరుపుకుంటున్నారు.
బతుకమ్మ చారిత్రక నేపథ్యం
బతుకమ్మ పండుగ ఎలా మొదలైంది? చరిత్రలో బతుకమ్మ స్థానం, ఆనవాళ్లు ఏమున్నాయన్న అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. చారిత్రక ఆధారాల మేరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటుల వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులు, రాష్ట్రకూటుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు, రాష్ట్రకూటులకు మద్దతుగా నిలబడ్డారు. క్రీస్తు శకం 973లో చాళుక్యరాజైన తైలపాడు.. రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణంతో అతని కుమారుడైన సత్యాసాయుడు రాజపీఠాన్ని అధిష్టించారు. అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా ) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని నాటి ప్రజల నమ్మకం.
ప్రజలు మాత్రమే కాకుండా చోళ రాజు పరాంతక సుందర చోళాకూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడని ప్రతీతి. రాజరాజేశ్వరి దేవి తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని పెకలించి తీసుకువెళ్లి తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు.
బృహదమ్మే.. మన బతుకమ్మ
తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు ప్రకటించారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరుపర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారని ఆధారాలు ఉన్నాయి. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా జరుగుతోంది. ‘‘ దాదాపు వేయి ఏళ్లుగా బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే ..’’ అని చండీ పరమేశ్వరీ పీఠం సిద్దాంతి డాక్టర్ ఎ.ప్రసాద శర్మ వివరించారు . బతుకమ్మ సందర్భంగా.. గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.
ప్రకృతిని ఆరాధించే పూల పండుగ
బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పూల పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు జరుపుకునే రోజుల్లో మహిళలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను .. బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.
ఆటా పాటా
గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దిద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ వయో బేధం లేకుండా మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మ ఆడుతారు. ఈ బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు. మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. . ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మను పేర్చేది ఇలా..
బతుకమ్మను పేర్చడంలో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) ని ఇచ్చి పుచ్చుకొని తింటారు. చక్కెర, రొట్టెతో చేసిన పిండివంటకం "మలీద" అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
బతుక్మమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
- మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
- రెండోరోజు అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
- మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
- నాల్గవరోజు నానబియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
- ఐదోరోజు అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
- ఆరోరోజు అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
- ఏడోరోజు వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
- ఎనిమిదోరోజు వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
- తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు.
ప్రాంతీయ ఆచారాన్ని బట్టి బతుకమ్మ పండుగ కొన్ని ప్రాంతాల్లో పెతరమావాస్య నుండి 5, 7, 9, 11 రోజులుగా జరుపుకుంటారు. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి తెచ్చి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )