HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Budget 2024 Live News Updates:రూ.2.91లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి
బడ్జెట్‌ప్రతుల్ని ఆర్థిక మంత్రికి అందిస్తున్న సిఎం రేవంత్‌ రెడ్డి
బడ్జెట్‌ప్రతుల్ని ఆర్థిక మంత్రికి అందిస్తున్న సిఎం రేవంత్‌ రెడ్డి

TG Budget 2024 Live News Updates:రూ.2.91లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి

25 July 2024, 14:15 IST

  • TG Budget 2024 Live News Updates: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కాల పరిమితి ముగియనుండటంతో రూ.2.91లక్షల కోట్ల అంచనాతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

25 July 2024, 14:15 IST

కేసీఆర్ ఫైర్

బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పద్దులో దళితబంధు ప్రస్తావన లేకపోవటం విచారకమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసినట్లు బడ్జెట్ ఉందని విమర్శించారు. మత్స్యకారులకు భరోసా లేదని… రైతుబంధు ఎప్పుడు వేస్తారనే ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైందన్నారు.

25 July 2024, 13:51 IST

తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ అసెంబ్లీ శనివారం ఉదయానికి వాయిదా వేశారు.

25 July 2024, 13:18 IST

ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా ఖర్చు చేస్తాం

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 33వేల కోట్లను కేటాయిస్తున్నట్టు మంత్రి భట్టి ప్రకటించారు. ప్రతి పంచాయితీకి పంచాయితీ భవనం, బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

25 July 2024, 12:46 IST

గృహ‌జ్యోతితో పేదల ఇళ‌్లలో వెలుగులు

200యూనిట్ల కంటే తక్కువ వినియోగించే అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని, అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేస్తున్నామని, ప్రభుత్వం బిల్లుల్ని డిస్కమ్‌లకు చెల్లిస్తున్నామని, మార్చి 1 నుంచి గృహ జ్యోతి 41.86లక్షల ఇళ్లకు రూ.583.05 కోట్లను సబ్సిడీగా చెల్లిస్తే బడ్జెట్‌లో రూ.2400కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

25 July 2024, 12:44 IST

ఉచిత బస్సు ప్రయాణం

ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికిఉపయోగిస్తోంది. పథకానికి అయ్యే ఖర్చును నెలవారీగా చెల్లిస్తోంది. మిలియన్ డాలర్ కార్పొరేషన్‌గా తెలంగాణ ఆర్టీసీ అవతరించింది. గ్యాస్‌ సిలిండర్‌తో తీవ్ర ఆర్థిక సమస్యగా మారితే,మహాలక్ష్మీ పథకంతో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ అందించామని, 30.06లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరిందని, బడ్జెట్‌లో రూ.723కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రూ.200కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

25 July 2024, 12:41 IST

విద్యారంగానికి 21వేల కోట్ల కేటాయింపు

తెలంగాణ విద్యా రంగానికి రూ.21,292కోట్ల రుపాయలు కేటాయించారు.

25 July 2024, 12:31 IST

గతంలో అనర్హులకు రుణమాఫీ

గత ప్రభుత్వంలో అనర్హులకు మాత్రమే రుణమాఫీ చేశారని, దాని వల్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యిందని, అర్హులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో రైతు బంధు స్థానంలో రైతు భరోసా రూపంలో ఏటా రూ.15వేలు చెల్లిస్తామని, దాని అమలుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి వాటిని సభలో చర్చించి విధివిధానాలను ఖరారు చేస్తామని ప్రకటించారు.

25 July 2024, 12:29 IST

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ

రైతులకు రూ.2లక్షల రుణమాఫీకి కాంగ్రెస్‌ కట్టుబడి ఉన్నామని, వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, రుణమాఫీ నిధులు సమీకరించాలనే సంకల్ప బలం తమకు ఉందన్నారు. 2014-18 మధ్య నాలుగు విడతల్లో రూ.లక్ష మాత్రమే విడుదల చేశారని, దాని వల్ల వడ్డీ భారం పెరిగిందన్నారు. రెండోసారి లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు కొద్దిపాటి రుణాలు మాత్రమే మాఫీ చేశారన్నారు. దీని వల్ల రైతులపై తీవ్రమైన భారం పడిందన్నారు. అరకొర రుణమాఫీ కాకుండా రైతులకు ఒకేసారి రూ.31వేల కోట్లను రుణమాఫీ చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ చిత్తశుద్దిని శంకిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పొదుపు, ప్రణాళికతో, రెండు లక్షల కోట్ల రుణమాఫీ అవసరమైన నిధులు సమీకరిస్తున్నామని, 11.34లక్ష మంది రైతులకు జూలై 18న రూ.6వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అది శిలాశాసనమేనని చెప్పారు.

25 July 2024, 12:22 IST

రూ.2.91లక్షల కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్

తెలంగాణలో 2024-25 ఆర్థికసంవత్సరానికి రూ.2.91లక్షల కోట్ల బడ్జెట్‌ను అందులో రెవిన్యూ వ్యయం రూ.2.20లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.33,487కోట్లుగా పేర్కొన్నారు.

25 July 2024, 12:20 IST

తలసరి ఆదాయం పెంచుతున్నాం

తెలంగాణలో తలసరి ఆదాయం అధికంగా ఉన్నా, తలసరి ఆదాయ స్థాయిలో జిల్లా స్థాయిల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, రంగారెడ్డి రూ.9.62లక్షలు ఉంటే వికారాబాద్‌లో లక్షన్నర మాత్రమే ఉందన్నారు.

25 July 2024, 12:18 IST

హామీలు నెరవేరుస్తున్నాం

ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సిలిండర్‌, రైతు రుణ మాఫీ వంటి ఎన్నికల హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేశామని భట్టి విక్రమార్క చెప్పారు.

25 July 2024, 12:17 IST

ఆర్నెల్లలో 35వేల కోట్ల అప్పులు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 35వేల కోట్ల అప్పులు చేస్తే 42వేల కోట్ల అప్పులు తీర్చామని భట్టి విక్రమార్క చెప్పారు. అదే సమయంలో ఎన్నికల హామీలను నెరవేర్చడానికి రూ.34వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

25 July 2024, 12:10 IST

అన్ని వర్గాలకు ఇబ్బందులు

పదేళ్ల పాలనతో కుంటు పడిన ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాల్సిన సమస్య తమకు ఎదురైందని ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.

25 July 2024, 12:09 IST

సాగునీటి నిర్మాణాల్లో అక్రమాలు

తప్పుడు విధానాలతో నాణ్యత లేని నిర్మాణాలతో సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ప్రయోజనాలను ఇవ్వలేకపోయాయని చెప్పారు. రైతులకు ప్రయోజనం కల్పించలేదని, సాగునీటి రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో సమకూరిన ఆదాయానికి, బకాయిలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోయిందన్నారు. ప్రణాళిక లేకుండా నడపడం, సొంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో వారసత్వంగా సమస్యలు అందుకున్నామన్నారు. విభజన నాటికి ఆర్థిక పరిపుష్టితో ఉన్న రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలను కూడా చెల్లించలేని స్థితి చేరిందన్నారు.

25 July 2024, 12:06 IST

తెలంగాణ అకాంక్షను గుర్తించింది కాంగ్రెస్

తెలంగాణ ప్రజల అకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని, పదేళ్లలో ఆశించిన పురోభివృద్ధి జరగలేదు. ఉత్తమకుమార ప్రగల్భాలు పలికి అన్ని రంగాల్లో విఫలమయ్యారని భట్టి బడ్జెట్‌ పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని, రూ.75వేల కోట్ల అప్పులతో మొదలై గత ఏడాది నాటికి రూ. 6.71లక్షల కోట్లకు అప్పులు చేరాయని, పదేళ్లలో పది రెట్లు అప్పులు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు,నిధులు, ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రంలో ఎంత వరకు నెరవేరాయో అంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు.

25 July 2024, 12:04 IST

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

నా తెలంగాణ కోటి రతనాల వీణ స్వప్నాన్ని సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞతలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మల్లు భట్టి విక్రమార్క

25 July 2024, 11:19 IST

తెలంగాణ అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సభకు హాజరు కానున్నారు. నందినగర్‌ నివాసం నుంచి కేసీఆర్‌ అసెంబ్లీకి బయల్దేరనున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి సభకు హాజరు కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు సభకు కేసీఆర్ హాజరు కాలేదు. ప్రతి పక్ష నాయకుడిగా తొలిసారి సభకు వస్తున్నారు.

25 July 2024, 11:13 IST

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీలో మరికాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. కొద్ది సేపటి క్రితమే బడ్జెట్‌కు క్యాబినెట్‌ అమోద ముద్ర వేసింది. బడ్జెట్‌ ప్రతిని తెలంగాణ గవర్నర్‌కు అందచేసిన తర్వాత సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

25 July 2024, 10:59 IST

ముగిసిన తెలంగాణ క్యాబినెట్ భేటీ

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్‌కు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

25 July 2024, 10:25 IST

రాష్ట్ర రాబడులపైనే ఆశలు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్‌ ఖరారు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కారు రూ.2,75,891 కోట్లతో 'ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల వ్యయాల కోసం రూ.78,911 కోట్లకు శాసన సభ ఆమోదం పొందింది. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31లోపు బడ్జెట్‌ను శాసనసభ అమోదించాల్సి ఉంది.

25 July 2024, 10:06 IST

నేడు సభకు కేసీఆర్?

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సభకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అసెంబ్లీకు హాజరు కానున్నారు. కేసీఆర్‌ సభకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది

25 July 2024, 10:06 IST

తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ క్యాబినెట్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది

25 July 2024, 9:29 IST

తెలంగాణలో పెరుగనున్న అప్పులు

తెలంగాణ బడ్జెట్‌లో అప్పులు మినహాయిస్తే పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపి చూస్తే గతేడాది మొత్తం రూ.1.69 లక్షల కోట్లు - మాత్రమే వచ్చింది. ఈ ఏడాది ఆదాయంమరో 10 శాతం పెరుగనుంది. వార్షిక ఆదాయం రూ.1.85 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు. ఈ ఏడాది రూ.59,625 కోట్ల రుణాలను తీసు కుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో తెలిపింది. ఇప్పుడు రుణ మాఫీ కోసమే ప్రత్యేకంగా రూ.30 వేల కోట్ల రుణాలను తీసుకోనుండటంతో ఈ ఏడాది తీసుకునే రుణాలు పెరగొచ్చు.

25 July 2024, 9:15 IST

రుణమాఫీకి రూ.30వేల కోట్లు…

తెలంగాణలో రైతు రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతుభరోసాకు రూ.15 వేల కోట్లతో వ్యవసాయ శాఖకే అత్యధికంగా దాదాపు రూ.50 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించనున్నారు. సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ. 40 వేల కోట్లు, సాగు నీటి పారుదలకు రూ.29 వేల కోట్లు, వైద్యశాఖకు రూ.15 వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 15 వేల కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం గృహ నిర్మాణ శాఖకు రూ.8 వేల కోట్లు కేటాయించే అవకాశముంది.

25 July 2024, 9:06 IST

కేంద్రం నుంచి తగ్గిన కేటాయింపులు

గతేడాది(2023-24) రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ద్వారా రూ.41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే రూ.18,958 కోట్లు మాత్రమే వచ్చాయి. 2024-25లో రూ. 21,075 కోట్లు వస్తా యని ఓటాన్ ఎకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినా ఏప్రిల్ నుంచీ జూన్ వరకూ మొదటి త్రైమాసికంలో ఖజానాకు ఏమీ రాలేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌లో చూపిన కేంద్ర గ్రాంట్లను కొనసాగించడంపై మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించనున్నారు.

25 July 2024, 9:02 IST

ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు త్వరలో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.2.75 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జె ట్లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించకపోవడంతో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్ర పద్దుపై పడనుంది.

25 July 2024, 9:01 IST

2.8లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

న్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు రూ.50 వేల కోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు.

25 July 2024, 8:58 IST

నేడు తెలంగాణ బడ్జెట్

గురువారం ఉదయం 9 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ ఖరారు కానుంది. మంత్రివర్గం ఆమోదించిన అనం తరం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి

    ఆర్టికల్ షేర్ చేయండి