TS Ministers to Nalgonda: ఎలక్షన్ టైమ్‌లో అధికార పార్టీ..అభివృద్ధి పనుల జాతర
29 September 2023, 9:14 IST
- TS Ministers to Nalgonda: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతో అధికార బీఆర్ఎస్ నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేర మంత్రులను జిల్లాల పర్యటనలకు పంపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
TS Ministers to Nalgonda: ఎన్నికలు సమీపిస్తుండటంతోతెలంగాణ మంత్రులు జిల్లా పర్యటనల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చేపట్టి, దాదాపు పూర్తయిన పనులను ప్రారంభించడం, ఎన్నికల హామీల్లో మిగిలిపోయినవి, ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్న వాటిపై దృష్టి పెట్టారు.
ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు బిఆర్‌ఎస్ సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తోంది. పనిలో పనిగా నియోజకవర్గ కేంద్రాల్లో, లేదంటే నియోజకవర్గంలో ప్రధాన మండల కేంద్రాల్లో జన సమీకరణ చేసి బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసింది. వీటిని ఎన్నికల రాజకీయ సభలుగానే పరిగణిస్తూ.. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అక్టోబరు 10వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనుల పూర్తికి, కొత్త పనుల శంకుస్థాపన ఏర్పాట్లతో పరుగులు పెడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ, మిర్యాలగూడెం నియోజకవర్గంలో ఒక్క రోజే ఇద్దరు మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ పర్యటనలు జరగనున్నాయి. అక్టోబరు 2వ తేదీన నల్లగొండ, సూర్యపేటల్లో రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) పర్యటనలు జరగన్నాయి.
సమస్యాత్మక నియోజకవర్గాలపై నజర్
ప్రస్తుతం మంత్రుల పర్యటనలు జరగనున్న తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాల్లో రాజకీయంగా బీఆర్ఎస్ కు సమస్యలు ఉన్నాయి. సూర్యాపేటలో కాంగ్రెస్ బలం పుంజుకోవడమే కాకుండా.. మంత్రి ప్రధాన అనుచరుడు వట్టె జానయ్య తిరుగుబాటు నష్టం చేకూర్చనుంది.
నల్లగొండలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూల పవనాలు వీయడంతో పాటు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దగ్గరి అనుచరుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ తిరుగుబాటు చేశారు. రెబల్ గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఇది ఒక విధంగా ఎమ్మెల్యే కంచర్లకు ఇబ్బందికరమైన పరిస్థతి.
దేవరకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, కొత్తవారికి టికెట్ ఇవ్వాలని ఒక బలమైన వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ వర్గం వచ్చే ఎన్నికల్లో రవీంద్రకుమార్ ఓటమికి ప్లాన్ చేస్తోంది. మిర్యాలగూడెంలో సైతం కుల రాజకీయం మొదలైంది. అతి స్వల్ప ఓట్లు మాత్రమే ఉన్న కులానికి చెందిన భాస్కర్ రావును ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీల్లోని ఒక కులం నాయకులు రెడీ అవుతున్నారు.
కాంగ్రెస్, లేదా సీపీఎం లనుంచి బలమైన ఆ కులానికి చెందిన నాయకులే బరిలోకి దిగనున్నారు. నకిరేకల్ నియోకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం అధికార బీఆర్ఎస్ కు మింగుడు పడని విషయం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటర్లను, తమ కేడర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మంత్రుల పర్యటనలు ఖరారు అయినట్లు చెబుతున్నారు.
ఇవీ.. కార్యక్రమాలు
శుక్రవారం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు రానున్నారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట (యాదాద్రి భువనగిరి జిల్లా )లో సబ్-ట్రెజరీ కార్యాలయానికి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
50 పడకల హాస్పిటల్ భవనం, చెన్నకేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన, కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామంలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో గ్రంథాలయ భవనం, సబ్- ట్రెజరీ కార్యాలయాలకు ప్రారంభోత్సవాలు ఉన్నాయి.
నకిరేకల్ లోనే మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా ) వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఏర్పాటు చేశారు. తుంగతుర్తిలో కూడా బహిరంగ సభ జరగనుంది.
గిరిజన ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
అధికార బీఆర్ఎస్ ముందు జాగ్రత్తతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. గిరిజనుల ఓట్లు ఎక్కువగా ఉన్న దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన జరగనుంది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో, దేవరకొండ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం లోని దామరచర్ల మండలంలో తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో బహింరగ సభలో ఆమె ప్రసంగించనున్నారు.
నల్లగొండలో మంత్రి కేటీఆర్ పర్యటన
రాష్ట్ర ఐటి, పురపాల శాఖా మంత్రి కేటీఆర్ అక్టోబరు 2వ తేదీన సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో వివిధ కార్యక్రమాల్లో పాలొగంటారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఐటి హబ్ లను ప్రారంభిస్తారు. ఇవి కాకుండా మరికొన్ని పనులు కూడా ఉన్నాయి.
చేనేత కార్మికులకు రూ.50కోట్ల విలువైన మరమగ్గాలను నల్లగొండలో అందజేసే కార్యక్రమం కూడా ఉంది. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. మరో వైపు ప్రజల నుంచి డిమాండ్ ఉన్న కొన్ని పనులకు కూడా మోక్షం లభిస్తోంది. కొత్త మండలాల ఏర్పాట్లకు గెజిట్లు విడుదల చేస్తున్నారు. దేవర కొండ నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం, చండూరు రెవెన్యూ డివిజన్, నకిరేకల్ నియోజకవర్గంలో అమ్మనబోలు మండల ఏర్పాటుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది.
రిపోర్టర్ : క్రాంతీపద్మ, నల్లగొండ