తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కేసీఆర్‌ది ప్రజల భాష, బీజేపీది మత విద్వేషాల భాష.. కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

కేసీఆర్‌ది ప్రజల భాష, బీజేపీది మత విద్వేషాల భాష.. కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

HT Telugu Desk HT Telugu

15 February 2022, 20:09 IST

google News
    • కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇండియా-పాకిస్థాన్ అంటూ సొల్లుపురాణం చెప్తారు. తెలంగాణకు కిషన్ రెడ్డి గుండు సున్నా అంటూ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
Telangana Minister - Harish Rao
Telangana Minister - Harish Rao (HT Photo)

Telangana Minister - Harish Rao

Hyderabad | సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను విమర్శించడం కాదు దమ్ముంటే తెలంగాణలో ఏ ప్రాజెక్టుకైనా కేంద్రం నుంచి జాతీయ హోదా తీసుకురావాలంటూ సవాల్ విసిరారు. అసలు తెలంగాణ రాకపోతే కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేదా? అని హరీష్ ప్రశ్నించారు.

ఉద్యమ సమయంలో తన సహచర ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ రాజీనామా చేసినా.. కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయకుండా పారిపోయారు. ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ పౌరుషాన్ని చాటడం కోసం తన పార్టీ కాకపోయినా యెండల లక్ష్మీ నారాయణ తరఫున ప్రచారం చేసి, ఆయనను గెలిపించారు. ఇది కిషన్ రెడ్డికి చాతకాలేదు. అలాంటి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ తో చర్చించే స్థాయి లేదు, తెరాస ఎమ్మెల్యేలు చాలని హరీష్ అన్నారు.

ఉద్యమంలో పలువురు యువకులు తమ ఆత్మహత్యలకు కిషన్ రెడ్డి కూడా కారణమని తమ లేఖల్లో పేర్కొన్నారు. కాబట్టి అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చే నైతికత కూడా కిషన్ రెడ్డికి లేదని హరీష్ అన్నారు.

భాష కాదు.. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు

కేసీఆర్ భాష గురించి కిషన్ రెడ్డి మాట్లడటమేంటి? కేసీఆర్‌ది ప్రజల భాష, ఒక సామానుడు మాట్లాడే భాష, పల్లెల్లో రైతులు ఎలా మాట్లాడుకుంటారో కేసీఆర్ అలాగే మాట్లాడతారు. కేసీఆర్ ఎప్పుడూ ఒకేలా మాట్లాడతారు, ఉద్యమకాలంలో కూడా అలాగే మాట్లాడారు.

మీది మతాల మధ్య చిచ్చుపెట్టే భాష, మత విధ్వేషాలను రెచ్చగొట్టే భాష అని హరీష్ అన్నారు.

కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇండియా-పాకిస్థాన్ అంటూ సొల్లుపురాణం చెప్తారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రధాని మోదీని ఎపుడైనా కిషన్ రెడ్డి ఆడిగారా? అంటూ హరీష్ నిలదీశారు. తెలంగాణకు కిషన్ రెడ్డి పెద్ద గుండు సున్నాగా మిగిలారని ఆయన విమర్శించారు.

టూరిజం మంత్రిగా సమ్మక్క సారలమ్మ జాతరకు రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చి కిషన్ రెడ్డి జబ్బలు చరచుకుంటున్నారు

తెలంగాణ రాష్ట్రం 364 కోట్లు ఖర్చు పెడుతోంది. కనీసం రాష్ట్ర పండగగా కూడా సమ్మక్క సారాలమ్మ జాతరను గుర్తించరా?

నదుల అనుసంధానంతో తెలంగాణ సస్య శ్యామలం అవుతుందని కిషన్ రెడ్డి అంటున్నారు

నిజంగా కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా? రాష్ట్ర ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వకుండా వేరే రాష్ట్రాల నీటి ప్రయోజనాల కోసం మాట్లాడటమా? విద్యుత్ సంస్కరణలకు ఆర్థిక సాయానికి కేంద్రం మెలిక పెట్టింది నిజం కాదా? అంటూ వివిధ అంశాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెరాస మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ఈ విషయాలన్నింటిని గమనిస్తుందని హరీష్ స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం