తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Pm Modi : అదానీ మోదీ బినామీ, ఈడీ దర్యాప్తుకు భయపడమన్న కేటీఆర్

KTR on PM Modi : అదానీ మోదీ బినామీ, ఈడీ దర్యాప్తుకు భయపడమన్న కేటీఆర్

HT Telugu Desk HT Telugu

09 March 2023, 13:07 IST

google News
    • KTR on PM Modi మోదీ,ఈడీలకు బిఆర్‌ఎస్‌ భయపడేది లేదని, రాజకీయ కక్ష సాధింపుల్ని తమ పార్టీ ఖచ్చితంగా  ఎదుర్కొంటుందని చెప్పారు.  ఢిల్లీ లిక్కర్ పాలసీ తాము రూపొందించలేదని,  కేంద్రం ప్రభుత్వ పాలసీలను ఉల్లంఘించి అదానీకి పోర్టుల్ని అప్పగించడంపై విచారణకు సిద్ధమేనా అని సవాలు చేశారు. 
ఈడీ విచారణను ఎదుర్కొంటామని ప్రకటించిన కేటీఆర్
ఈడీ విచారణను ఎదుర్కొంటామని ప్రకటించిన కేటీఆర్ (twitter)

ఈడీ విచారణను ఎదుర్కొంటామని ప్రకటించిన కేటీఆర్

KTR on PM Modi ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ కాదని, అదానీకి ఎయిర్‌ పోర్ట్‌ల విషయంలో జరిగింది కుంభకోణమని కేటీఆర్‌ ఆరోపించారు. రెండు ఎయిర్‌ పోర్ట్‌లకు మించి దేశంలో ఎవరికి ఇవ్వకూడదనే పాలసీ నిర్ణయాన్ని ప్రధాని ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు.

లిక్కర్‌ స్కామ్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు పూర్తిగా సహకరిస్తారని, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ నాయకుడు బిఎల్‌.సంతోష్ పారిపోయి దాక్కున్నాడని, విచారణ ఎదుర్కొలేక పారిపోయాడన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ నోటీసుల్ని ధైర్యంగా విచారణ ఎదుర్కొంటారని, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే విచారణకు పిలిచారని కేటీఆర్ చెప్పారు.

మోదీకి దమ్ముంటే అదానీ వ్యవహారంలో విచారణకు సిద్దపడాలన్నారు. గౌతమ్ అదానీ విషయంలో ప్రధాని మోదీ గొంతు ఎందుకు పెగలడం లేదని, రాజకీయ కక్ష సాధింపుల్ని ప్రజా కోర్టుల్లోనే ఈ వేధింపులు తేల్చుకుంటామన్నారు. కవిత తర్వాత కూడా వేధింపులు ఉంటాయని తమకు తెలుసన్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది నాయకుల్ని బీజేపీ వేధించిందో జాబితాను కేటీఆర్ వివరించారు.

లక్షల కోట్లు ఆవిరైనాా ఎందుకు మాట్లాడరు…?

గౌతమ్ అదానీ విషయంలో హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చినా పిఎం, ఆర్ధిక మంత్రి బయటకు రారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చిన్న పిల్లల్ని సైతం అదానీ ఎవరని అడిగినా ఎవరి బినామినో చెబుతారన్నారు. బినామిలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని విమర్శించారు. గౌతమ్ అదానీకి ఆరు ఎయిర్ పోర్టుల్ని ఇవ్వడంపై ఆర్ధిక శాఖ, నీతి ఆయోగ్ అభ్యంతరం ఇచ్చినా కేటాయింపులు ఆగలేదన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించే అదానీపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. 13లక్షల కోట్ల సంపద ఆవిరైనా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అదానీ పోర్టుల్లో 21వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు హెరాయిన్ దొరికినా ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు.

జి టూ జికి బీజేపీ సొంత భాష్యం….

దేశంలో ఎల్‌ఐసి డబ్బులు ఆవిరైతే ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రధాని మోదీకి మీడియాను ఎదుర్కొనే ధైర్యం కూడా లేదన్నారు. బిబిసినే వదిలి పెట్టలేదు, భారతీయ మీడియా ఎంతనే అహంకారం బీజేపీలో ఉందన్నారు. అదానీ కంపెనీ ప్రధాని సొంత కంపెనీ అని కేటీఆర్‌ ఆరోపించారు. జి టూ జి అంటే గవర్నమెంట్‌ టూ గవర్నమెంట్‌ కాదని గౌతమ్‌ టూ గోటాభాయ్ అని ఎద్దేవా చేశారు.

దేశంలో జరుగుతున్న ఈడీ దాడులన్ని ప్రతిపక్ష నాయకులపైనే జరుగుతున్నాయని, మోదీ అధికారంలోకి వచ్చాక ఈడీ ద్వారా 5422 కేసులు పెట్టారని, వాటిలో 23 మాత్రమే విచారణ పూర్తి చేసినందుకు మోదీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ మీద 24 కేసులు, శివసేన, బీజేడీ, డిఎస్పీ, ఆప్‌, వైసీపీ, బిఆర్‌ఎస్‌ల మీద వరుస కేసులు పెట్టి ప్రతిపక్షాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు 40లక్షలు లంచం తీసుకుంటే ఏమి చేశారని, మహారాష్ట్రలో బీజేపీ ఎంపీ తన మీదకు ఈడీ రాదని ధైర్యంగా చెప్పారని, దేశంలో ఏమి జరుగుతుందో చూడాలన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో 9రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని, ప్రతి పక్ష ప్రభుత్వాలను కూల్చి గద్దెనెక్కడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను కూల్చి, ఈడీ,సిబిఐ, ఐటీలను ప్రయోగించడం నిజం కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో ఒకరికి 18వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. స్వదేశాల్లో బొగ్గు లభిస్తుండగా విదేశాల నుంచి ఎందుకు కొనాలో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు.

అదానీ కోసం బొగ్గు కొనుగోళ్లు….

అదానీ, అదానీ బొగ్గు, ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు కోసం రాష్ట్రాలను ఒత్తిడి చేస్తున్నారని, యూపీ రాసిన లేఖకు కూడా పిఎం ఎందుకు సమాధానం చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. బెంగాల్‌లో సువేందుపై కేసులు పెట్టి పార్టీ మారేలా చేసి ఇప్పుడు బీజేపీ ఫ్లోర్ లీడర్ చేశారన్నారు.

శారదా కుంభకోణంలో నిందితుడైనా హిమాంశుబిశ్వాస్ శర్మ మీద ఉన్న కేసులు వదిలేసి సిఎంను ఎందుకు చేశారని ప్రశ్నించారు. బీజేపీయేతర నాయకుల్ని వేదించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

కర్ణాటకలో 40పర్సెంట్ ప్రభుత్వమని ఆరోపణలు వస్తే, కర్ణాటకలో మఠాలను ఎలా వేధిస్తున్నారో దేశం మొత్తం చూస్తోందని చెప్పారు. మేఘాలయ సంగ్మాను అవినీతి పరుడని విమర్శించిన అమిత్ షా, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సంగ్మా ప్రమాణ స్వీకారానికి వెళుతున్నాడని, సిగ్గులేకుండా ప్రవర్తించడంలో బీజపీ నాయకుల తర్వాతే ఎవరైనా అన్నారు.

సుజనా చౌదరి, సిఎం రమేష్‌ ఎలా చేరారు….?

గంగలో మునిగిన వారి పాపాలు పోయినట్లు బీజేపీలో చేరిన వారి కేసులు అన్ని రద్దవుతాయని విమర్శించారు. మాజీ ఎంపీ సుజనా 120 షెల్‌ కంపెనీల ద్వారా 6వేల కోట్ల రుపాయల మోసాలకు పాల్పడితే ప్రధాని ఏమి చేశారని ప్రశ్నించారు. ఈడీ ఆరోపణలు చేసిన వెంటనే 2019 జూన్‌20న సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు బీజేపీలో చేరారని ఆరోపించారు. ఈడీ ఆరోపణలు చేసిన ఆరు నెలల్లోనే టీడీపీ నుంచి బీజేపీలో చేరారని ఆరోపించారు.

ఈడీ డైరెక్టర్, ఎల్‌ఐసి ఛైర్మన్‌‌లకు మూడుసార్లు పదవీ కాలాన్ని పొడిగించారని, దోపిడీలకు సహకరిస్తున్నందుకే వారి పదవీ కాలం పెంచుతున్నారని, రాజకీయంగానే బీజేపీని ఎదుర్కొంటామన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే బిఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని, బీజేపీని గత ఎన్నికల్లో 150 స్థానాల్లో డిపాజిట్లు లేకుండా చేశామని ఈసారి భూస్థాపితం చేస్తామన్నారు.

తదుపరి వ్యాసం