TS Govt Letter to NDSA : 'మేడిగడ్డ' నివేదికపై తీవ్ర అభ్యంతరాలు - తెలంగాణ సర్కార్ ఘాటు లేఖ
05 November 2023, 9:33 IST
- Medigadda Barrage Report: మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టుపై లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వివరాలను సరిగ్గా పరిశీలించకుండానే… అర్థం చేసుకోకుండానే హడావుడిగా నివేదిక ఇచ్చారని ప్రస్తావించింది.
మేడిగడ్డ ప్రాజెక్ట్ (Twitter)
మేడిగడ్డ ప్రాజెక్ట్
TS Govt Letter to NDSA : మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టుపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ఈ మేరకు NSDAకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆరు పేజీల లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాలను సరిగ్గా పరిశీలించకుండానే… అర్థం చేసుకోకుండానే హడావుడిగా నివేదిక ఇచ్చారని అన్నారు. 17 అంశాలపై సమాచారమిస్తే 11 ఇచ్చామంటారా..? అని లేఖలో పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని పరిశీలించకుండా హడావుడిగా నివేదిక ఇచ్చారని… పరీక్షించకుండానే కారణాలు ఎలా నిర్ధారిస్తారు? అని లేఖలో ప్రస్తావించారు.బ్యారేజీ పునరుద్ధరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లేఖలో ప్రస్తావించిన పలు అంశాలు:
- 20 అంశాలపై సమాచారం కోరితే 11 మాత్రమే ఇచ్చినట్లు నివేదికలో తెలిపారు. బ్యారేజీ పరిశీలన, అనంతరం జరిగిన సమావేశంలో డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన అన్ని పత్రాలను చూపించాం. ఆ తర్వాత 20 డాక్యుమెంట్లు పంపాలని గత నెల 27న లేఖ వచ్చింది. మాకు పనిదినాలు కాకపోయినా అక్టోబరు 29న సాయంత్రానికి 17 పంపాం. మిగిలిన మూడింటినీ నవంబరు 1న మెయిల్ ద్వారా అందించాం. ఈ పత్రాలను చూసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై తొందరపాటుతో నివేదికను ఇచ్చారు.
- ఎన్‌డీఎస్ కమిటీ భూగర్భ పరీక్షలు లేకుండానే పిల్లర్ కుంగుబాటును ఎలా నిర్ధారిస్తారు. బ్యారేజీ పునాది పూర్తిగా నీటితో నిండి ఉంది. విచారణ చేయకుండానే మేడిగడ్డ బ్యారేజీ సంఘటనపై నిర్ధారణకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
- నీటిని మళ్లించి బరాజ్ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాం. ఆ పరిశోధనాత్మక పని పూర్తయిన తర్వాత మాత్రమే పియర్ల మునకకు కారణాలు అంచనా వేయగలుగుతాం. ప్రస్తుతానికి మీ నిర్ధారణలతో మేం ఏకీభవించలేకపోతున్నాం.
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన నివేదికాలు నిరాధారమైనవి. నిపుణుల కమిటీ రెండు బ్యారేజీలను అసలు సందర్శించలేదు.
- బీఐఎస్ సూచించిన ప్రమాణాలు, సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా సెకాంట్ పైలింగ్ కార్యకలాపాలు నిర్వహించాం. ప్రాజెక్ట్ అమలు సమయంలో నాణ్యత నియంత్రణకు సంబంధించిన ఎన్‌డీఎస్‌ఏ కమిటీ తన రిపోర్ట్‌లో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి.
- 13.12.2021 నుంచి డ్యామ్ భద్రతా చట్టం అమలులోకి వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు 12-07-2023న మాత్రమే నిర్దేశిత ఆనకట్టల జాబితాలో చేర్చారు. హైడ్రాలజీ, కాస్టింగ్, ఇరిగేషన్ ప్లానింగ్, పర్యావరణ అనుమతులు తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 06.06.2018న జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
- బ్యారేజీ పునరుద్ధరణకు NSDA సహకరించాలని రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.