తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. ఆ సమాచారమంతా ఈడీకి ఇవ్వాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. ఆ సమాచారమంతా ఈడీకి ఇవ్వాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Madasu Sai HT Telugu

02 February 2022, 16:16 IST

google News
    • టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై గతంలో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు (Official Website)

తెలంగాణ హైకోర్టు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై రేవంత్‌ రెడ్డి వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈడీ జేడీ అభిషేక్‌ గోయెల్‌ కోర్టుకు తెలిపారు. ఆన్ లైన్ విచారణలో నేరుగా కోర్టుకు వివరించారు. మరోవైపు తమ వద్ద ఉన్న సమాచారమంతా ఈడీకి, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జీపీ కోర్టుకు వెల్లడించారు.

వాదనలు విన్న న్యాయస్థానం.. డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డ్రగ్స్‌ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈడీకి సహకరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. మరోవైపు.. వివరాలు ఇవ్వకపోతే.. తమను సంప్రదించవచ్చునని ఈడీకి కూడా హైకోర్టు తెలిపింది.

డ్రగ్స్ కేసుపై గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

2017లో రేవంత్ రెడ్డి టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ విధానం చెప్పాలని కోరినా.. ప్రభుత్వం వాయిదా వేసిందని చెప్పుకొచ్చారు. మెుదట్లో తామే విచారణ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం చెప్పిందన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్- సీబీఐ విచారణ చేయించాలని గతంలోనే రేవంత్ రెడ్డి కోరారు. తమకు ఈ విషయంలో సహకారం అందించడం లేదని.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయని వెల్లడించారు. ఆ తర్వాత ఈడీ విచారణ మెుదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం