TSPSC Group 1 Prelims : గ్రూప్-1 రద్దును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు
27 September 2023, 14:34 IST
- TSPSC Group 1 Prelims : తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్ - 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రద్దు
TSPSC Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు సబబేనని కోర్టు తెలిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకొని మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించాలని హైకోర్టు టీఎస్పీఎస్సీకి తేల్చి చెప్పింది.
మళ్లీ పరీక్ష నిర్వహించండి
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన విషయం తెలిసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం విచారించిన కోర్టు సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ప్రభుత్వ రిట్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోసారి నిర్వహించక తప్పనిపరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహరం తర్వాత జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించింది. ఈ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు పరీక్ష మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చారు.
టీఎస్పీఎస్సీకి ప్రశ్నలు
సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు టీఎస్పీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా రద్దైన పరీక్ష నిర్వహణలో మళ్లీ అదే నిర్లక్ష్యం సరికాదన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని నోటిఫికేషన్ లో ప్రకటించి...ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించింది. మీ నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారా? ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వారి పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించింది. బుధవారం కొనసాగిన విచారణలో సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ గ్రూప్-1 ను రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,202 మంది గ్రూప్ 1 కు అప్లై చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా పేపర్ లీకేజీ వ్యవహారంతో ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది జూన్ 11 మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించగా... ఈ పరీక్షను తాజాగా హైకోర్టు రద్దు చేసింది.