Polavaram Gates: పోలవరం స్పిల్‌వే గేట్లు తెరిచి ఉంచాలని తెలంగాణ డిమాండ్
25 July 2023, 11:01 IST
- Polavaram Gates: భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో స్పిల్ వే గేట్లను పూర్తిగా తెరిచిఉంచాలని తెలంగాణ డిమాండ్ చేసింది. వరద ముంచెత్తడంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నందున పూర్తి స్థాయి అధ్యయనం చేసే వరకు నీటిని నిల్వ చేయొద్దని డిమాండ్ చేస్తోంది.
పోలవరం స్పిల్ వే ను పూర్తిగా తెరిచి ఉంచాలని తెలంగాణ డిమాండ్
Polavaram Gates: గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో స్పిల్ వే గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని తెలంగాణ డిమాండ్ చేసింది. వరద ప్రవాహాన్ని నియంత్రించడానికి గేట్లను పూర్తి సామర్థ్యంతో తెరవాలని డిమాండ్ చేసింది. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈమేరకు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు.
2022 జూలైలో వచ్చిన వరదల్లో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకునే వరకు ఈ వరద ప్రవాహాన్ని పూర్తిగా దిగువకు విడుదల చేయాలని కోరారు.
భద్రాచలం వద్ద ఊహించని రీతిలో వరద ప్రభావం ఉంటున్నందున, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని ఈ ఏడాది కూడా అధ్యయనం చేయాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
రివర్స్ క్రాస్ సెక్షన్లను కొత్తగా సర్వే చేయించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు కేంద్ర జలసంఘానికి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ సోమవారం లేఖ రాశారు. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టేవరకూ ప్రాజెక్టు స్లూయిస్ గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచవద్దని కోరారు.
సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 36.3 అడుగులు, పొలవరం వద్ద నీటిమట్టం 11.8 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నా పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహానికి అడ్డు కట్టలు వేసి ఉన్నాయి కాఫర్ డ్యామ్‌లు నిర్మించి ఉండటంతో వాటి మీదుగా నదీజలాలను స్పిల్ వే మీదకు మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను మూయకపోతే ఆ ప్రభావంతో వరద వెనక్కి తన్నే ప్రమాదం ఏర్పడుతుంది. ఫలితంగా భద్రాచలంతో పాటు తెలంగాణలోని పలు గ్రామాలు నీట మునిగిపోతాయి. గత ఏడాది భారీగా నష్టంగా వాటిల్లడంతో ఈ ఏడాది ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.