తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Group-2 Exam : తెలంగాణ గ్రూప్-2 మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!

TS Group-2 Exam : తెలంగాణ గ్రూప్-2 మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!

10 October 2023, 21:53 IST

google News
    • TS Group-2 Exam : తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్షను జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
టీఎస్ గ్రూప్ 2
టీఎస్ గ్రూప్ 2

టీఎస్ గ్రూప్ 2

TS Group-2 Exam : తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించడం కష్టమని టీఎస్పీఎస్సీ తెలిపింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్‌-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని నిర్ణయించారు. గ్రూప్‌-2 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

783 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్

అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు టీఎస్పీఎస్సీ గ్రూప్‌ -2 పరీక్షలను ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే. నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో... గ్రూప్‌-2 పరీక్షలను కమిషన్ మరోసారి వాయిదా వేసింది. జనవరి 6, 7 తేదీల్లో ఉదయం గం.10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం గం. 2.30 నుంచి 5.00 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమని భావించిన టీఎస్పీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టులకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. సుమారు 5.51 లక్షల మంది గ్రూప్ 2 కు దరఖాస్తు చేసుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో

అయితే ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అభ్యర్థులు విజ్ఞప్తులతో నవంబర్‌ 2, 3 తేదీలకు వాయిదా పడ్డాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. గ్రూప్-2 పరీక్షల కోసం 1600 కేంద్రాలు అవసరం అవుతాయని, దాదాపు 25 వేల మంది పోలీసులు, మరో 20 వేల మందికిపైగా సిబ్బంది అవసరం అవుతారని టీఎస్పీఎస్పీ భావించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఓ వైపు ఎన్నికలకు, మరోవైపు పరీక్షలకు సిబ్బందిని కేటాయించడం సాధ్యంకాదని భావించిన కమిషన్ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. తాజాగా గ్రూప్ 2 వాయిదా పడడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

తదుపరి వ్యాసం