TS Governor : బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ గవర్నర్ తమిళ సై
07 August 2022, 6:39 IST
- సమస్యల పరిష్కారం కోసం విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై బాసర చేుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ చేరుకున్నారు. ఇన్‌ఛార్జి వీసీ వెంకట రమణ గవర్నర్‌కు స్వాగతం పలికారు.
సమస్యల పరిష్కారం కోసం బాసట ట్రిపుల్ ఐటీ ఆందోళన చేస్తున్న విద్యార్ధులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై ట్రిపుల్ ఐటీ క్యాంపస్ చేరుకున్నారు. గత రెండు నెలలుగా విద్యార్ధులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. గత నెలలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీతో ఆందోళన విరమించిన విద్యార్ధులు కల్తీ ఆహారంతో ఓ విద్యార్ధి మరణించడంతో మరోమారు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై విద్యార్ధులతో భేటీ కానున్నారు. రైలు మార్గంలో నిజామాబాద్ చేరుకున్న గవర్నర్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ చేరుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత విద్యార్ధులు ఆ స్థాయిలో రోడ్డెక్కి సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు వివిధ రాజకీయ పక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి. దాదాపు రెండు నెలలుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నా వారి డిమాండ్లు మాత్రం పరిష్కారం కావట్లేదు.
దాదాపు 8వేల మంది విద్యార్ధులు చదువుతున్న బాసర ట్రిపుల్ ఐటీ తెంలగాణ రాష్ట్రంలో అతిపెద్ద సంఖ్యలో విద్యార్ధులు ఉన్న క్యాంపస్‌లలో ఒకటిగా ఉంది. 14ఏళ్ల క్రితం ఏర్పాటైన విద్యా సంస్థలో ఇప్పుడు వాష్ రూమ్‌లు బాగోవని, తలుపులకు గడియలు ఉండవని, యూనివర్శిటీలో ఫ్యాకల్టీ లేరని, విద్యార్ధులకు యూనిఫాంలు, బెడ్ షీట్స్ లేవని, ల్యాప్‌టాప్ లు కూడా ఇవ్వడం లేేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్ధిని విద్యార్ధులకు మెరుగైన అవకాశాలు, ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేశారు. ఐఐటీల స్థాయి సాంకేతిక విద్యను గ్రామీణ విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. బాసర, నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లతో ట్రిపుల్ ఐటీల ప్రస్థానం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతిలో టాప్ మార్కులు తెచ్చుకున్న విద్యార్ధులకు ఇంటర్‌తో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ అందించే ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్ని వీటిలో ప్రారంభించారు. ప్రతి క్యాంపస్‌లో ఎంపికైన వారికి ఉచితంగా విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
బాసరలో 270 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్ధులు చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ గ్రాంట్లపై పూర్తిగా ఆధారపడటంతో ఇటీవల గ్లోబల్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. నిధుల కొరత, నిర్ణయాలు తీసుకునే స్థాయి పదవులు ఖాళీగా ఉండటంతో బాసర ట్రిపుల్ ఐటీ ప్రమాణాలు పడిపోతూ వచ్చాయి. విద్యా, భోజన, వసతి, ఇతర సౌకర్యాలలో ఇబ్బందులు పెరిగిపోయాయి.
రెండు నెలల క్రితం విద్యార్ధుల పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చినా మళ్లీ పునరావృతం కావడంతో విద్యార్ధులు పోరు బాట పట్టారు. యూనివర్శిటీకి శాశ్వత ఛాన్సలర్ నియామకం, శాశ్వత వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ల నియామకం, ఐటీ ఆధారిత విద్యా బోధన కోసం ల్యాప్‌టాప్‌ల పంపిణీ, నాణ్యమైన భోజనం, హాస్టళ్లలో వసతులు, యూనిఫాం పంపిణీ, హాస్టళ్లలో మంచాలు, దుప్పట్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ వంటి డిమాండ్లతో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.
14ఏళ్ల క్రితం ఏర్పడిన ఆర్జీయూకేటీకి నిధుల సమస్య వల్లే ఇబ్బందులు వచ్చాయని ఇంచార్జి వీసీ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత 15రోజుల్లో రూ.16కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఇన్‌చార్జి విసి చెబుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో 25కోట్లు త్వరలో వస్తాయంటున్నారు. ప్రతి నెల యూనివర్శిటీ నిర్వహణ కోసం రూ.8-10కోట్ల రుపాయల ఖర్చవుతుందని ఆ స్థాయిలో నిధుల లభ్యత ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో గవర్నర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. యూనివర్శిటీలో క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యార్ధుల సమస్యలు తెలుసుకోనున్నారు.