KTR Davos Tour : దావోస్ పర్యటన ద్వారా తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు..
21 January 2023, 23:35 IST
- KTR Davos Tour : దావోస్ పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని పేర్కొన్నారు.
దావోస్ పర్యటనలో కేటీఆర్ బృందం
KTR Davos Tour : స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక (World Economic Forum) సదస్సులో పాల్గొన్న కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ బృందం.... పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని... ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో... నాలుగు రోజుల పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన కేటీఆర్ బృందం... పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పర్యటన ఫలవంతమైందని ప్రకటించింది.
దావోస్ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో.. 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ భేటీలు.. రెండు ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొనట్లు తెలిపారు. పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో మరో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోందని.. రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో భారతీ ఎయిర్ టెల్ భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను స్థాపించనుందని వెల్లడించారు కేటీఆర్. ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలిలో రూ. వెయ్యి కోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుందని... పెప్సికో.. పీ అండ్ జీ.. అల్లాక్స్.. అపోలో టైర్స్.. వెబ్ పీటీ.. ఇన్ స్పైర్ బ్రాండ్ వంటి సంస్థలు రూ. 2 వేల కోట్ల మేర పెట్టబడులు పెట్టేందుకు అంగీకరించాయని తెలిపారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు రానున్న రోజుల్లో సానుకూల ఫలితాలు ఇస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
లైఫ్ సైన్సైస్, ఆరోగ్య సంరక్షణపై పరిశోధనలు చేసేందుకు హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేస్తామని వరల్డ్ ఎకనామిక్ ఫోరంనకు చెందిన సెంటర్ ఫర్ ఫోర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సంస్థ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు దావోస్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. సీ4ఐఆర్ సెంటర్ నెలకొల్పేందుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణలో ఉన్న అనుకూలతలు, సామర్థ్యానికి ఈ ఒప్పందం నిదర్శనమన్నారు.