తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

TS Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

22 May 2023, 21:37 IST

google News
    • TS Formation Day : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఈ లోగోను రూపొందించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

TS Formation Day : జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. లోగో ఆవిష్కరణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఈ లోగోను రూపొందించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, సచివాలయం, అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, టీహబ్‌, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ చిత్రాలతో లోగోను రూపొందించారు.

21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్రం కోసం అమరులైన వారిని స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా మార్టియర్స్‌ డేగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అమరుల స్తూపాలను పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించి, గ్రామ గ్రామాన అమరవీరులకు నివాళులర్పించాలన్నారు.

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

దళిత వైతాళికుడు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మహనీయుడు భాగ్యరెడ్డి వర్మను గౌరవించుకోవడంతో పాటు వారి స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించేందుకు వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల కోసం పాఠశాలలను స్థాపించి వారి విద్యాభివృద్దికి, ఉన్నతికి భాగ్యరెడ్డి వర్మ గట్టి పునాదులు వేశారని సీఎం అన్నారు. దళితజాతి విద్యా వికాసానికి, సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి మాదరి భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని సీఎం కొనియాడారు.

ఎస్సీల అభ్యున్నతికి పథకాలు

భాగ్య రెడ్డి వర్మ స్ఫూర్తితో ఎస్సీ కులాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ప్రగతి నిధి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టీఎస్ ప్రైడ్, నిరుపేద ఎస్సీ కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్, ఎస్సీలకు గొప్ప భవిష్యత్ ను అందించేందుకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యాబోధన వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలతో ఎస్సీల సమగ్రాభ్యున్నతికి ప్రభుత్వం గొప్ప కార్యాచరణను అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. ఎస్సీల సంపూర్ణ వికాసానికి, వారి స్వయం సమృద్ధికి యావత్ దేశంలోనే లేని విధంగా దళితబంధు పథకాన్ని తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టడంతో పాటు, హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం వెనుక దళితజాతిని సమున్నతంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆకాంక్ష వెల్లడవుతుందని సీఎం అన్నారు.

తదుపరి వ్యాసం