Gaddar Passes Away : ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, సీఎం కేసీఆర్ ఆదేశాలు
06 August 2023, 21:52 IST
- ప్రజాగాయకుడు గద్దర్(77) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గద్దర్ మృతిపట్ల రాజకీయ , సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, సీఎం కేసీఆర్ ఆదేశాలు
ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ కు ఆదేశాలు ఇచ్చారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రజాయుద్ధనౌక గద్దర్ నిష్క్రమణ తీరని లోటు - ఎమ్మెల్సీ కవిత
ప్రజాకవి గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గద్దర్ మృతిపట్ల కవిత తన ప్రగాఢ సంతాపం తెలిపారు. జన నాట్యమండలి స్థాపించి జనం కోసం గొంతెత్తి, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడు గద్దర్ అని గుర్తుచేసుకున్నరు. ప్రజాయుద్ధనౌక గద్దర్ నిష్క్రమణ తీరని లోటు అన్నారు. గద్దర్ భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు పాటల రూపంలో నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయన్నారు. జోహర్ గద్దర్ అంటూ కవిత నివాళులు అర్పించారు.
గద్దర్ మృతిపట్ల తెలంగాణ అసెంబ్లీ నివాళులు, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని తెలంగా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ గద్దర్ కు నివాళులర్పించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్తంగా కీర్తి తీసుకువచ్చిన ప్రజావాగ్గేయ కారుడు గద్దర్ అన్నారు. గద్దర్ మరణం తెలంగాణ ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించే వార్త అన్నారు. ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ విప్లవ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.
తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన కళాకారుడు గద్దర్- సీఎం కేసీఆర్
ప్రజాకళలకు, ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలు మరువలేనివి అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన కళాకారుడు గద్దర్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గద్దర్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గద్దర్ సాధారణ బుర్రకథ కళాకారుడిగా జీవితం ప్రారంభించి విప్లవ పంథాలో మమేకమయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటతో తెలంగాణ భావజాలాన్ని వ్యాపించచేశారన్నారు.
ఎల్బీస్టేడియానికి గద్దర్ భౌతికకాయం తరలింపు
ప్రజాకవి, ఉద్యమ కెరటం గద్దర్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ ఎల్బీ స్టేడియానికి తరలించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్(77) అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్... తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు.
గద్దర్ గళం అజరామరం - చిరంజీవి
గద్దర్ మృతికి సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం అని చిరంజీవి ట్వీట్ చేశారు. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందన్నారు. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిదని తెలిపారు. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు తన ప్రగాడ సంతాపం తెలిపారు.
తెలంగాణ మంత్రుల సంతాపం
ప్రజా గాయకుడు, జన నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు గద్దర్ మృతి చాలా బాధాకరం అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటు అన్నారు. గద్దర్ ప్రసంగాలు, పాటలు ప్రజలలో స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గా పేరుపొందిన గుమ్మడి విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని పొందారన్నారు. తన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపారని మంత్రి గంగుల గుర్తుచేసుకున్నారు. గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఏపీ సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రజాకవి గద్దర్ మరణంపై రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికిన గద్దర్ మరణం ఊహించలేదన్నారు. గద్దర్ కు తెలుగు జాతి మొత్తం సెల్యూట్ చేస్తోందన్నారు. గద్దర్ లాంటి వ్యక్తుల మాటలు, పాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయని తెలిపారు. గద్దర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసిందన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గద్దర్ కన్నుమూత
ప్రజాగాయకుడు గద్దర్(77) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూఫ్రాన్ లో జన్మించారు గద్దర్. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు గద్దర్. గుండెపోటుతో ఇటీవల అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుప్తరిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న గద్దర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు.
అపోలో వైద్యుల ప్రకటన
గద్దర్ మృతిపై అపోలో వైద్యులు ప్రకటన జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ అమీర్ పేట్ అపోలో ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో కన్నుమూశారని వైద్యులు తెలిపారు. జులై 20న గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు వైద్యులు. ఆయన గుండె సమస్య నుంచి కోలుకున్నాయి. అయితే ఆయనకు గతంలో ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలు ఉన్నాయి. వయసు పైబడడంతో ఈ సమస్యలు మళ్లీ తలెత్తి ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.