Voting Identity Cards : ఓటర్ ఐడీ కార్డు లేదా? ఈ 12 కార్డుల్లో ఏ ఒక్కటున్నా ఓటు వేయొచ్చు!
29 October 2023, 14:40 IST
- Voting Identity Cards : ఓటరుగా నమోదు చేసుకుని, ఓటర్ ఐడీ కార్డు లేని వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీ కార్డుకు బదులుగా మరో 12 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క కార్డు చూపించినా ఓటు వేయొచ్చని తెలిపింది.
ఓటర్లు
Voting Identity Cards : ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఎన్నికల్లో ఓటు వేసే వెసులుబాటును కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల సమయంలో ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు దొరకకపోతే ఓటు హక్కు అవకాశాన్ని చేజార్చుకోవద్దని సూచించింది. ఓటరు కార్డు లేకపోయినా మిగతా గుర్తింపు కార్డులతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ తెలిపింది. సాధారణంగా మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు పోలింగ్ కేంద్రంలోని అధికారులు మన ఓటరు గుర్తింపు కార్డును చూపించమని అడుగుతారు. దానిపై ఉన్న పేరు, ఫొటో ఎపిక్ నంబర్, ఇతర వివరాలన్నీ మనకు సంబంధించినవేనా లేదా అని ఒకటిరెండు సార్లు చెక్ చేస్తారు.ఆ సమయంలో ఓటరు కార్డు బదులుగా ఈ 12 కార్డులలో ఏ ఒక్కటి చూపించినా సరిపోతుంది.
ఓటర్ కార్డు లేదా? అయితే ఈ కార్డులలో ఏ ఒక్కటున్నా పర్లేదు!
• ఆధార్ కార్డు
• డ్రైవింగ్ లైసెన్స్
• పాన్ కార్డ్
• ఇండియన్ పాస్ పోర్టు
• ఫొటోతో ఉన్న పోస్టాఫీసు పాస్ బుక్
• ఫొటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
• ఆర్బీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు
• కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
• రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు
• ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన అధికారిక గుర్తింపు పత్రం
• దివ్యాంగుల గుర్తింపు కార్డు
• ఎంఎన్ఆర్జీఎ జాబ్ కార్డు
వీటిలో ఏ ఒక్కటి తీసుకెళ్లినా మనకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మొదటి ఆరు కార్డులలో ఏదో ఒకటైన మనతో ఉంచుకుంటే మంచిదని చెబుతున్నారు ఎన్నికల అధికారులు.
వృద్ధులు, వికలాంగులు ఇంట్లో నుంచే ఓటు వేయొచ్చు
అయిదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంటుంది. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇటు రాష్ట్రఎన్నికల సంఘం అధికారులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వయసు పైబడి, మంచంకే పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు ఓట్లు వేసేందుకు వారి నివాసం నుంచి పోలింగ్ జరిగే ప్రాంతానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల జరిగే కేంద్రంలో ర్యాంప్ లను నిర్మించి వృద్ధులను, వికలాంగులను ట్రై సైకిల్ సహాయంతో పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చి ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నారు. అలా వాహనాల్లో కూడా పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల కోసం ఎన్నికల కోసం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. పోలింగ్ అధికారులే నేరుగా వారి నివాసం వద్దకు ఈవీఏం మిషన్ తో వెళ్లి ఓటర్ తో పోలింగ్ అధికారి రహస్యంగా ఓటు వేయిస్తారు. ఇటీవలే ఎన్నికలు జరిగిన కర్ణాటక రాష్ట్రంలో అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
12 విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
కేంద్ర ఎన్నికల సంఘం జర్నలిస్టులకు కూడా చక్కటి వెసులుబాటు కల్పించింది. ఎన్నికల విధుల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. జర్నలిస్టులతో పాటు మొత్తం 12 విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించింది. బీఎస్ఎన్ఎల్ ,ఎఫ్సీఐ , ఏఏఐ, పీఐబీ, విద్యుత్ శాఖ, రైల్వే శాఖ ,వైద్యారోగ్య శాఖ, పౌరసరఫరాల శాఖ, ఆర్టీసీ, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి అనుమతి పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్