TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. మే 9,10 ఇంజనీరింగ్, 11,12న అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రన్స్
21 February 2024, 6:51 IST
- TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్ EAPCET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఎంసెట్‌గా నిర్వహించే ప్రవేశపరీక్షను కొద్ది రోజుల క్రితం ఈఏపీ సెట్‌గా మార్చారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విడిగా నీట్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల
TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ Notification విడుదలైంది. జేఎన్‌టియూ హైదరాబాద్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్ Engineering కాలేజీలతో పాటు అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున జేఎన్‌టియూ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈఏపీ సెట్ 2024ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష Computer Based test ద్వారా నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి అయాకోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ ఈఏపీ సెట్ 2024ను ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుము వివరాలు, తేదీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కన్వీనర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మరింత సమాచారంతో పాటు దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in లో అందుబాటులో ఉంటుంది.
ప్రవేశ పరీక్ష తేదీలు ఇవే...
ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను మే 9, 10 తేదీలలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్ 3 నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లలో ప్రవేశపరీక్షను మే 11,12 తేదీల్లో నిర్వహిస్తారు. ఉదయం 9-12 మధ్య ఓ సెషన్, మధ్యాహ్నం 3 నుంచి ఆరు వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు...
ఈఏపీ సెట్ 2024 దరఖాస్తు ఫీజును ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైన అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. ఇతర క్యాటగిరీల అభ్యర్థులకు రూ.900గా నిర్ణయించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000గా, ఇతరులకు రూ.1800గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీజులను టిఎస్ ఆన్‌లైన్ సెంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో చెల్లించే వారు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ సెంటర్ల ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు (TS EAPCET 2024 Important Dates)
ఫిబ్రవరి 21 - నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు-ఆన్ లైన్ అప్లికేషన్లు
ఏప్రిల్ 8 నుంచి 12 వరకు- ఎడిట్ ఆప్షన్
మే 1 నుంచి -హాల్ డికెట్లు డౌన్ లోడ్
మే 9, 10వ తేదీల్లో- ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్షలు,
మే 11, 12వ తేదీల్లో -అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు