TG EAPCET 2024 Counselling: నేటి నుంచి తెలంగాణ ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్, డైరెక్ట్ లింక్ ఇదే…
04 July 2024, 7:45 IST
- TG EAPCET 2024 Counselling: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. 12వ తేదీ వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
నేటి నుంచి తెలంగాణ ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్
TG EAPCET 2024 Counselling: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ 2024 మొదటి విడత కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభమవుతంది.
జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధ్రువ పత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్లను స్వయంగా వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన వారు జూలై 8 నుంచి 15వ తేదీ వరకు వారికి నచ్చిన కాలేజీల్లో, కోర్సులను ఎంచుకునేందుకు వెన్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 19వ తేదీలోగా తొలి విడత సీట్లు కేటాయిస్తామని ఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన పేర్కొన్నారు.
తెలంగాణ ఈఏపీ సెట్ 2024 వెబ్సైట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్లలో ప్రవేశాల కోసం వేర్వేరు విండోలను అందుబాటులో ఉంచారు.
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం గతంలో వేర్వేరు వెబ్సైట్లను నిర్వహించే వారు. ఈ ఏడాది సెట్ వెబ్సైట్లోనే వాటిని అనుసంధానించారు. ఈఏపీసెట్ దరఖాస్తు చేసిన సైట్ నుంచి నేరుగా అడ్మిషన్ల కోసం వెళ్లేందుకు వీలు కల్పించారు.
ఈఏపీ సెట్ నిర్వహణ కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి https://eapcet.tsche.ac.in/ వెబ్సైట్ రూపొందించింది.
అడ్మిషన్ మీద క్లిక్ చేస్తే నేరుగా https://eapcet.tsche.ac.in/TSEAPCET/Admission.aspx కౌన్సిలింగ్ సైట్కు రీ డైరెక్ట్ అవుతుంది. అందులో ఇంజనీరింగ్ ప్రవేశాలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ద్వారా నిర్వహించే కోర్సులకు వేర్వేరు లింకులు అందబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ కోర్సులకు ఒక విండో, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు మరో విండో అందుబాటులో ఉంది.
వారం రోజులు ఆలస్యం…
ఉన్నత విద్యామండలి ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. జూన్ 27వ తేదీ నుంచే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. అయితే ఈ షెడ్యూల్ ను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం…. జులై 6వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ విడతకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇది జూలై 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. జులై 19న ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయించనున్నారు.
- TG EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 2024- కొత్త తేదీలు
- జూలై 4, 2024 - ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.
- జూలై 6, 2024 నుంచి జూలై 13 వరకు - ధ్రువపత్రాల పరిశీలన
- జులై 8, 2024 నుంచి జూలై 15వ తేదీ వరకు - వెబ్ ఆప్షన్ల ఎంపిక
- జూలై 19, 2024 - ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
- జులై 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్.
- జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్.
- జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు.
- జులై 31వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు.
- ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ.
- ఆగస్టు 9వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన.
- ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం.
- ఆగస్టు 13వ తేదీ మూడో విడత సీట్ల కేటాయింపు.
- ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్ల గైడ్స్ లైన్స్ విడుదల.
అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tsche.ac.in/
జూలై 23 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్….
జులై 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 31వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 9వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 13న సీట్ల కేటాయింపు ఉండగా… ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్కు ఛాన్స్ ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 22 వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ తో పాటు 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 27, 28 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 28న స్పాట్ అడ్మిషన్ల గైడ్స్ లైన్స్ విడుదల కానున్నాయి.
ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో అబ్బాయిలు…. 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే అమ్మాయిలు…. 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.