TS EAMCET Counselling : తెలంగాణ ఎంసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్, ఎప్పటినుంచంటే?
02 August 2023, 22:08 IST
- TS EAMCET Counselling : తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రకటించారు. ఆగస్టు 17న స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ జరగనుంది.
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్
TS EAMCET Counselling : తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్) ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుది విడత కౌన్సెలింగ్ పూర్తిన తర్వాత ఆగస్టు 17 నుంచి స్పెషల్ ఫేజ్ లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా కొందరు విద్యార్థులు కౌన్సెలింగ్ హాజరుకాలేకపోయారని, ఈ కారణాలతో మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కన్వీనర్ తెలిపారు. అయితే ఎంసెట్(ఇంజినీరింగ్) తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ ఫేజ్ లో ఈనెల 4న స్లాట్ బుకింగ్, 5వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి, 9న సీట్లు కేటాయించనున్నారు. తుది విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 9 నుంచి 11 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే తుది విడత తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 17న స్లాట్ బుకింగ్, 18న సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఈ నెల 23న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ల కోసం 23న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ వాకాటి కరుణ ప్రకటించారు.
సెకండ్ ఫేజ్ పూర్తి
తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్) రెండో విడత సీట్ల కేటాయింపు ఇటీవల పూర్తైంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు ప్రకటించారు. రెండో విడతలో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ తెలిపారు. ఆగస్టు 4 నుండి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రెండో విడత కౌన్సెలింగ్ లో 25,148 మంది విద్యార్థులు తమ సీట్లను మార్చుకున్నారు. ఇంకా 12,013 ఇంజినీరంగ్ సీట్లు మిగిలినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. నాలుగు యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2 లోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కన్వీనర్ సూచించారు. ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
TS EAMCET కౌన్సెలింగ్ 2023- ఫేజ్ 3 షెడ్యూల్
- ఆగస్టు 4 - ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
- ఆగస్టు 5 - ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
- ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు- సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ ఎంపిక
- ఆగస్ట్ 6 - ఆప్షన్‌లు ఫ్రీజింగ్
- ఆగస్టు 9 - ఇంజినీరింగ్ సీట్లు తాత్కాలిక కేటాయింపు
- ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు- వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్