Telangana Congress : కాంగ్రెస్‍లో 'బీసీ' నినాదం...!టికెట్ల లెక్క తేలుతుందా..?
27 September 2023, 17:22 IST
- Telangana Assembly Elections : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచే దిశగా అడుగులేస్తోంది. ఓవైపు 6 గ్యారెంటీ హామీల పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో పడింది. మరోవైపు పార్టీలోని బీసీ నేతలు… కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్
BC MLA Tickets Issue in Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు... వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగింది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది.మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్…ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేయటంతో పాటు… విజయభేరి సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. అంతేకాదు కీలకమైన ఆరు హామీలతో గ్యారెంటీ కార్డును ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఇక అభ్యర్థుల జాబితాను ప్రకటించటమే మిగిలి ఉంది. ఇప్పటికే పలు స్థానాలపై లీకులు వస్తుండగా… పార్టీలోని ముఖ్య నేతలు బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా… ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. దీంతో పలు స్థానాల్లో నెలకొన్న పోటీ ఆసక్తికరంగా మారింది.
ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు…
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ లోని బీసీ నేతలు మొదట్నుంచి కోరుతున్నారు. ఈ విషయంలో పార్టీ కూడా సిద్ధంగా ఉందంటూ రాష్ట్ర నాయకత్వం కూడా పలుమార్లు ప్రకటనలు చేసింది. అయితే ప్రస్తుతం టికెట్ల కేటాయింపులపై కసరత్తు జరుగుతోంది. అయితే పలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీ నేతలకు టికెట్లు ఇవ్వటం కష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పార్టీలోని బీసీ నేతలు… ఇటీవేల ఓ ముఖ్య సమావేశం నిర్వహించారు. బీసీలకు న్యాయం చేసే రీతిలో టికెట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే… బీసీలను విస్మరించే పని చేయవద్దని కోరారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఈ క్రమంలో పలువురి నేతల టికెట్లు డైలామాలో పడిపోయాయి. ఇదే విషయాన్ని పార్టీలోని బీసీ నేతలు… గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చే వారికి టికెట్లు ఇస్తే…. తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు జనగామలో పొన్నాల టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. కొంత కాలం క్రితం పార్టీలోకి వచ్చిన కొమ్మూరి ప్రతాపరెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల పరిస్థితేంటన్న చర్చ తెరపైకి వస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన పొన్నాలకు హ్యాండ్ ఇస్తే పార్టీకే నష్టమని బీసీ నేతలు చెబుతున్నారు. ఇక టికెట్ల అంశంపై పొన్నాల కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. బీసీలను విస్మరించవద్దని కోరుతున్నారు. ఇక మల్కాజ్ గిరిలో చూస్తే మైనంపల్లి రాకతో ఆయనకే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మొన్నటి వరకు బాధ్యతలు చూస్తున్న నందికంటి శ్రీధర్ పరిస్థితేంటన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇలా చాలా నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పార్లమెంట్‌కు రెండు బీసీ సీట్లు అనేది మరింత కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు నల్గొండ పార్లమెంటు స్థానంలోని దేవరకొండ (ఎస్టీ) మినహాయిస్తే… ఆరు జనరల్ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్ నగర్, కోదాడ నియోజవర్గలు ఉండగా… ఒక్క చోట కూడా బీసీ అభ్యర్థికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపించటం లేదు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నేతలు ఉన్నారు. ఇలాంటి చోట్ల రెండు సీట్లు బీసీలకు ఇస్తారా..? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆలేరులో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండగా… మరో నియోజకవర్గంపై క్లారిటీ రావటం లేదు. ఇలా దాదాపు మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ బీసీ అభ్యర్థులకు టికెట్ల అంశం హాట్ టాపిక్ గా మారింది.
వచ్చే ఎన్నికల్లో 40 కి పైగా సీట్లు ఆశిస్తున్న బీసీ నేతలు… తమ సామాజికవర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అలా కుదరకపోతే టికెట్ల కేటాయింపు అంశాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. తమకు న్యాయం జరుగుతుందనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ ఎలా ముందుకెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది.