Hyderabad Book Fair: భాగ్యనగరంలో పదిరోజుల పాటు పుస్తకాల పండుగ, ఎన్టీఆర్ స్టేడియంలో 29 వరకు నిర్వహణ..
20 December 2024, 11:05 IST
Hyderabad Book Fair: భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీ వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రదర్శన ప్రారంభించారు. సామాజిక స్పృహ, సమాజంలో వస్తున్న మార్పులపై చర్చించేందుకు బుక్ ఫెయిర్ మంచి వేదిక అన్నారు.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Book Fair: హైదరాబాద్‌లో పుస్తకాల పండుగ ప్రారంభమైంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మాధ్యమాల వినియోగం పెరగడం వల్ల పుస్తకాల ప్రాముఖ్యత తగ్గుతుందని, పుస్తక పఠనం, హైదరాబాద్ బుక్ ఫెయిర్ వంటి కార్యక్రమాలు తర్వాతి తరానికి పుస్తకాలు చదవడానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక స్పృహ, సమాజంలో మార్పులపై చర్చించడానికి పుస్తక ప్రదర్శనలు మంచి వేదికలన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో కాళోజీ, దాశరథి వంటి కవులు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని, అందెశ్రీ, గూడ అంజయ్య, గద్దర్ వంటి ప్రముఖ రచయితలు రెండో దశలో ప్రేరణ ఇచ్చారన్నారు. వాస్తవ చరిత్రను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 'గతంలో అధికారంలో ఉన్న వారు వారికి అనుకూలంగా చరిత్రను రాసుకున్నారు. రాయించుకున్నారని, అదే నిజమని ప్రజలకు భ్రమ కల్పించారు' అని సీఎం వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజల్లోకి అసం పూర్తి, తప్పుడు సమాచారం వెళ్తుందన్నారు. ఇలాంటి సమయంలో కవులు, కళాకారులు వారి కలాలకు పదును పెట్టాలని తమ గళాలు ఎత్తాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు సరైన సమాచారం తెలియజేయాలన్నారు. తమ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన మహనీయులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలి పారు. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామని గుర్తు చేశారు.
పది రోజుల పాటు పుస్తకాల పండుగ నిర్వహణ
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను పది రోజుల పాటు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. 37 వ జాతీయ పుస్తక ప్రదర్శనలో పలు ప్రముఖ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఈ నెల 29 వరకు కొనసాగే ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచు రణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మొత్తం 350 స్టాళ్లు ప్రదర్శనలో ఉన్నాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది.తెలంగాణ పబ్లిషర్స్, విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, మంచి పుస్తకం, మిళింద్ పబ్లి షర్స్, అన్వీక్షికి, నవ తెలంగాణ వంటి సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి.
పుస్తకాలు చదివితేనే చరిత్ర తెలుస్తుంది.
పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మాధ్యమాల వినియోగం పెరగడం వల్ల పుస్తకాలు, పుస్తక పఠనానికి ప్రాధాన్యం తగ్గిపోతోందన్నారు. ఇంత పెద్ద బుక్ ఫెయిర్ నిర్వహించడం వల్ల తర్వాతి తరం పుస్తకాలు చదవడానికి ప్రేరణ లభిస్తుందని చెప్పారు. చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా భావితరాలకు మంచి సందేశం ఇవ్వగలం.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వడానికే నేను, మంత్రులు బుక్ ఫెయిర్ లో పాల్గొన్నాం. సామాజిక స్పృహ, సమాజంలో మార్పులపై చర్చించేందుకు బుక్ ఫెయిర్ మంచి వేదిక అన్నారు.
పుస్తక ప్రదర్శనల్లో వివిధ వేదికలకు తమ రచనలు, పాటల ద్వారా ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ రచయితలు, కళాకారుల పేర్లను పెట్టడం సమాజానికి మంచి సందేశమన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో మరణించిన తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం గురించి మాట్లాడాను. సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ మొదటి, రెండో దశల ఉద్యమాలు కూడా కొంతమేర వక్రీకరించబడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి కంటే రాజకీయ ప్రయోజనాలు పొందిన వారే ఎక్కువ ప్రజాదరణ పొందారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారి పేర్లను చరిత్రలో లిఖించాలి' అని సీఎం అన్నారు.
ఏపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై తాను మాట్లాడానని, పుస్తకాలు, పాటల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అవగాహన కల్పించానని చెప్పారు.కొత్త తరానికి గూగుల్ మాత్రమే తెలుసు. చరిత్రకారులు రాసిన పుస్తకాలను చదవడం వల్ల పాఠకులకు అజ్ఞాత వీరులు తెలుసుకుంటారు. ఆ పోరాటంలో మరణించిన వారి గురించి చరిత్రకారులు రాస్తేనే మనకు తెలుస్తుందని చెప్పారు.
సుప్రసిద్ధ చరిత్రకారులకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కాళోజీ, దాశరథి వంటి కవులు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. అందెశ్రీ, గూడ అంజయ్య, గద్దర్ వంటి ప్రముఖ రచయితలు రెండో దశ తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచారు. వాస్తవ చరిత్రను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందన్నారు.