తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Clp Tour : గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సిఎల్పీ బృందం పర్యటన

CLP Tour : గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సిఎల్పీ బృందం పర్యటన

HT Telugu Desk HT Telugu

16 August 2022, 14:18 IST

google News
    • గోదావరి వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల్లో సిఎల్పీ బృందం పర్యటిస్తోంది.  భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పర్యటిస్తున్నారు. 
భద్రాబలంలో సీఎల్పీ నేతల పర్యటన
భద్రాబలంలో సీఎల్పీ నేతల పర్యటన

భద్రాబలంలో సీఎల్పీ నేతల పర్యటన

అకాల వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ముంపు ప్రాంతాలను సిఎల్పీ బృందం పరిశీలిస్తోంది. వరదలతో గోదావరి ముంచెత్తిన ప్రాంతాల పర్యటనకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు భద్రాచలం చేరుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే శ్రీపురం వీరయ్య నేతృత్వంలో సిఎల్పీ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి వరద ముంపు ప్రాంతాలు, కరకట్టను పరిశీలించారు. గోదావరి వరద మంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన సీఎల్పీ బృందం మంగళవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో కాంగ్రెస్ శాసనసభక్ష బృందానికి స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సిఎల్పి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు

గోదావరి వరదతో ముంచెత్తిన భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీని సిఎల్పీ బృందం సందర్శించింది. వరద ముంపుతో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు వివరించారు. 70 అడుగుల ఎత్తున వరద రావడంతో పది రోజుల పాటు కట్టు బట్టలతో సత్రంలో తల దాచుకున్నామని ఆహార పానీయాలు కూడా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పునరావసం నుంచి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు బాధితులు చెప్పారు.

కేసీఆర్ వచ్చింది దేనికోసం?

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించడానికి వచ్చి తమ సుభాష్ నగర్ కాలనీకి రాలేదని ఆ కాలనీవాసులు సీఎల్పీ బృందానికి తెలిపారు. భద్రాచలంలో సుభాష్ నగర్ కాలనీ వరద ముంపునతో పూర్తిగా మునిగిపోయిందని ఆ విషయం తెలిసినా సీఎం కేసీఆర్ తమ కాలనీకి రాకుండా భద్రాచలానికి ఎందుకు వచ్చారని బాధితులు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ భద్రాచలం కి వచ్చింది వరద బాధితుల గోడు వినడానికా? గోదావరి పూజలు చేయడానికా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. టిఆర్ఎస్ మంత్రులు జిల్లా అధికారులు కూడా సుభాష్ నగర్ వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. భద్రాచలం ముంపు సమస్య, కరకట్ట ఎత్తు నిర్మాణానికి సాంకేతిక నిపుణుల కమిటీ వేయాలని అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారికి భరోసా ఇచ్చారు.

రూ. 45 కోట్లు ఏం చేశారో అడగండి….

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భద్రాచలం కరకట్ట నిర్మాణం మరమత్తులు ఎత్తుకోసం 2014 ముందు 45 కోట్లు రూపాయలు మంజూరు చేశామని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఆ నిధులను ఎందుకు ఖర్చు పెట్టలేదో టిఆర్ఎస్ నాయకులను మంత్రులను నిలదీయాలని సుభాష్ నగర్ కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ఇసుక ర్యాంపు వద్ద నుంచి నెల్లిపాడు వరకు సుమారు 300 మీటర్ల దూరం కట్ట చేయకుండా వదిలివేయడం వల్లే బ్యాక్ వాటర్ తో సుభాష్ నగర్ కాలనీ ముంపునకు గురవుతున్నదని ప్రభుత్వానికి తెలియకపోవడం అవివేకం అన్నారు. భద్రాచలంలోనే ఉండి జిల్లా మంత్రి అజయ్ ఎందుకు కాలనీకి రాలేదు టిఆర్ఎస్ నాయకులను ప్రజా ప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

దుమ్ముగూడెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు….

మరోవైపు దుమ్ముగూడెం పర్యటనకు వెళ్లకుండా కాంగ్రెస్ బృందాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం సందర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఎసిపి రోహిత్ ఎమ్మెల్యేలకు చెప్పడంతో ప్రభుత్వ వైఖరి తీరును ఎండగడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ఎందుకు వెళ్ళనివ్వరని ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న రహస్యం ఏముందని నిలదీశారు. కచ్చితంగా దుమ్ముగూడెం వెళ్తామని భీష్మించడంతో పోలీసులు భారీగా మోహరించి అటువైపుగా వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు ప్రభుత్వానికి కేసీఆర్ కు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి తలెత్తింది.

తదుపరి వ్యాసం