Telangana Cabinet Decisions : రైతులకు శుభవార్త.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
26 October 2024, 23:11 IST
- Telangana Cabinet Decisions : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గిరిజన యూనివర్శిటీకి భూమి కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమిని బదలాయించింది.
తెలంగాణ కేబినెట్ మీటింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ శనివారం జరిగింది. ఈ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో సెంట్రల్ వర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది.
మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడానికి ఆమోదం తెలిపింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపుపైనా నిర్ణయం తీసుకుంది. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదించింది. నాగోల్-ఎల్బీనగర్-హయత్ నగర్, ఎల్బీనగర్-శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం రాత్రి మీడియాకు వివరించారు. దీపావళి కానుకగా ఈ నెల 31న ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. పేదవాళ్లలో అతి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలుకు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.