TS BJP Protest: పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన, గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత
17 March 2023, 13:07 IST
- TS BJP Protest: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పేపర్ లీక్ వ్యవహారంపై బీజేపీ గన్ పార్క్ వద్ద నిరసనకు దిగడంతో భారీగా పోలీసులు మొహరించారు. అంతకు ముందు భారీ ర్యాలీ చేపట్టారు.
గన్ పార్క్ వద్దకు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ నాయకులు
TS BJP Protest: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద దీక్షకు దిగారు. బీజేపీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరిన బండి.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
గ్రూప్ 1 ప్రాథమిక ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నాడని కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్‌పై పెద్ద ఎత్తున రగడజరుగుతున్నా నోరు మెదపని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పేపర్ లీక్ వ్యవహారంపై తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి బీజేపీ కార్యకర్తలంతా ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎలక్షన్ లో గెలిచేది బీజేపీ ప్రభుత్వమే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన ఏవీఎన్ రెడ్డి బీజేపీకీ స్పూర్తి, ఆదర్శం అని బండి అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని బండి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి టీచర్లే గుణపాఠం చెప్తారని బండి వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి పాదయాత్రగా గన్ పార్క్ వద్దకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. బండి సంజయ్‌తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణుల్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమరవీరులకు నివాళులు అర్పించేందుక పోలీస్ అనుమతి అవసరం లేదన్న బండి సంజయ్ ముందుకు సాగారు. గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించి తీరుతామని కరాఖండిగా తేల్చిచెబుతూ గన్ పార్క్ వైపు బయలుదేరారు.
బండి సంజయ్ ఆందోళన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నియామకాలను నిలిపేసి నిరుద్యోగుల పొట్టకొట్టి అమరవీరుల ఆశయాలకు కేసీఆర్ సర్కార్ తూట్లు పొడుస్తోందంటూ బండి సంజయ్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. బండి సంజయ్‌కు మద్దతుగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.
మరోవైపు బీజేపీ నాయకులు గన్ పార్క్ వదిలివెళ్లాలని పోలీసులు హెచ్చరించ డంతో వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తున్నామని న బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న తమపై బలవంతపు చర్యలొద్దని బండి సంజయ్ హెచ్చరించారు. కార్యకర్తలను బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.
బండి సంజయ్ తోపాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, కార్యదర్శి జయశ్రీ తదితరులు గన్ పార్క్ వద్ద నిరసన దీక్షలో కూర్చున్నారు.