Telangana BJP : తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు- దిల్లీ నుంచి బండి సంజయ్ కు పిలుపు, జితేందర్ రెడ్డితో ఈటల భేటీ
03 July 2023, 14:00 IST
- Telangana BJP : తెలంగాణ బీజేపీలో మార్పులు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది. దిల్లీ నుంచి బండి సంజయ్ పిలుపు రావడం, జితేందర్ రెడ్డి-ఈటల భేటీతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.
బండి సంజయ్
Telangana BJP : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లేదా జాతీయ నాయకత్వంలోకి తీసుకుని అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పేరు పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహగానాలు, మంత్రివర్గంతో ప్రధాని మోదీ భేటీ జరుగుతున్న సమయంలో బండి సంజయ్‌కు దిల్లీ నుంచి పిలుపువచ్చింది. ప్రస్తుతం ముంబయి పర్యటనలో ఉన్న బండి సంజయ్ హుటాహుటిన దిల్లీ బయలుదేరి వెళ్లారు. దిల్లీలో జాతీయ నాయకులతో ప్రైవేట్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొంటారని సమాచారం. బండి సంజయ్ ను దిల్లీ పిలవడంపై తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.
మోదీ సభకు అధ్యక్ష హోదాలో హాజరవుతానో లేదో
ఆదివారం హన్మకొండలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలతో సమావేశమైన బండి సంజయ్ రాష్ట్ర నాయకత్వం మార్పులపై సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 8న జరిగే ప్రధాని మోదీ మీటింగ్‌కు తాను అధ్యక్ష హోదాలో హాజరు అవుతానో లేదో అని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడే తెలంగాణ బీజేపీ కీలక మార్పులు ఉంటాయని పార్టీ శ్రేణులు భావించాయి. తాజాగా బండి సంజయ్‌కు దిల్లీ నుంచి పిలపురావడంతో... ఆయన స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని బండి సంజయ్ తెలిపారు. బీజేపీకి త్యాగాల చరిత్ర ఉందని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో మోదీ సభను విజయవంతం చేద్దామని కార్యకర్తలతో అన్నారు.
జితేందర్ రెడ్డితో ఈటల భేటీ
మరోవైపు మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్‌రెడ్డితో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగించాలని జితేందర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఈటల భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. జితేందర్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో వీరిద్దదరూ భేటీ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వార్ జరిగింది. ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు ఈటల. ఇటీవల జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈటల రాజేందర్ కూడా కౌంటర్ వేశారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదంటూ మాట్లాడారు. వీరిద్దరి మధ్య వివాదం నెలకొన్న సందర్భంలో... ఫామ్ హౌస్ లో భేటీ ఆసక్తికరంగా మారింది.