TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సాయన్నకు సంతాపం తెలిపిన సభ
03 August 2023, 12:37 IST
- TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
షTS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ్యలు నివాళులు అర్పించారు. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు. వ్యక్తిగతంగా తనకు సాయన్నతో మంచి అనుబంధం ఉందన్నారు.
ఎలాంటి సందర్భంలోనైనా సాయన్న చిరునవ్వుతో ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. అనేక సందర్భాల్లో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినట్లు వివరించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగర పాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందిందని చెప్పారు. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. సాయన్న నిజామాబాద్ జిల్లాలో జన్మించి, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో సెటిలై.. వ్యాపారవేత్తగా ఉన్నారన్నారు.
వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించిందని సిఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
తెలంగాణలో చివరి సమావేశాలు…
గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఎన్నికలకు ముందు జరిగే చిట్టచివరి సమావేశాలుగా ని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో బిఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలైన కాంగ్రెస్, భాజపాలు కూడా దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే పరస్పర విమర్శలు, ఆరోపణలు ఇప్పటికే హోరెత్తుతున్నాయి. ఈసారి సభాపర్వంలో కూడా ఆ వేడి, వాడి కనిపించనుందని తెలుస్తోంది.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహకారం లేదని.. వ్యవసాయ విద్యుత్తుపై కాంగ్రెస్ వైఖరి తదితర అంశాల్లో విపక్షాలపై దాడికి బిఆర్ఎస్ సిద్ధం అవుతోంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకు కాంగ్రెస్, భాజపాలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. శాసన సభలో తాము చేసిన పనులు చెప్పుకోవడానికి క ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు సూచించినట్లు సమాచారం.
శాఖలవారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని, పనితీరును వివరించేందుకు సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విపక్షాలు విమర్శిస్తున్న అంశాలపై చర్చ నిర్వహించి, ఆయా అంశాలపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా సభలో దీటుగా మాట్లాడాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఐఆర్‌లపైనా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవల మంత్రివర్గం ఆమోదించగా.. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను కూడా తిరిగి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఈ బిల్లులపై చర్చించి, వీటి ప్రాముఖ్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు. బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల నష్టాలు కలిగాయని సభావేదికగా ప్రజలకు వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలిరోజు సమావేశాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సమావేశాలు మరుసటి రోజుకు వాయిదాపడనుంది. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో గురువారం బీఏసీలో నిర్ణయిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.