TS BJP First List : 38 మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా, ఈ నెల 15 లేదా 16న ప్రకటన!
08 October 2023, 16:43 IST
- TS BJP First List : తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవ్వడంతో పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఈ నెల 15 లేదా 16న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుందని సమాచారం.
బీజేపీ తొలి జాబితా
TS BJP First List : ఈ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ 115 స్థానాల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వడపోత చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను వెలువడనుందని తెలుస్తోంది. 38 మందితో బీజేపీ తొలి జాబితాను సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.
ఎన్నికలకు బీజేపీ రెడీ
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే అమావాస్య తర్వాత బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తొలిజాబితా ప్రకటన చేశారు. ఇటీవల దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, కేంద్రమంత్రుల పర్యటనలపై చర్చించారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. నవంబర్ మొదటి వారంలోపు తెలంగాణలో 30 సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు.
అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ నేతల సమావేశం
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ దిల్లీలో సమావేశం అయింది. అభ్యర్థుల జాబితా ఖరారుపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో జాబితాను ఖరారు చేసి అధిష్టానానికి అందించనున్నారు. మంగళవారం లేదా బుధవారం భేటీ కానున్న ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈనెల 14లోపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే అవకాశం ఉంది. మరోవైపు సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓబీసీ నేతలు కోరుతున్నారు. కనీసం 35 సీట్లు ఇవ్వాలని అధిష్టానానికి వినతి పత్రాలు అందించారు. గత నెల 22న నిర్వహించిన సమావేశంలో దాదాపు 80కుపైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.