తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telugu News Updates 13 October : 23న తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర
రాహుల్ జోడో యాత్రపై కాంగ్రెస్
రాహుల్ జోడో యాత్రపై కాంగ్రెస్

Telugu News Updates 13 October : 23న తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర

13 October 2022, 22:47 IST

  • Today Telugu News Updates: అక్టోబర్ 13 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

13 October 2022, 22:47 IST

వ్యవసాయేతర విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు

వ్యవసాయేతర విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్ల బిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్​ చివరి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. తదుపరి మీటర్ల బిగింపునకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. రెండు దశల్లో గృహ, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలకూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ పరిధిలో కనెక్షన్ల వారీగా స్మార్ట్ మీటర్లు బిగించేలా ప్రణాళికలు చేస్తున్నారు.

13 October 2022, 22:21 IST

23న తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర

కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుంది. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుందన్నారు.

13 October 2022, 22:18 IST

ఫ్లోరైడ్ బాధితుడితో కేటీఆర్

మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా ఉంటానని స్వామి కుటుంబానికి మంత్రులు భరోసా ఇచ్చారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని మంత్రి కేటీఆర్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయించారు.

13 October 2022, 17:41 IST

బస్సులో 65 లక్షలు

కర్నూలు జిల్లా హాలహర్వి చెక్‌పోస్ట్‌ వద్ద 65 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. బ్యాగ్‌ను చెక్ చేయడంతో నగదు కనిపించింది. ఎటువంటి బిల్లులు లేకపోవటంతో స్వాధీనం చేసుకున్నారు. ఆదోనికు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

13 October 2022, 17:39 IST

ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవో ఉపసంహరణ

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోపై జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ వేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కేసులను ఉపహసంహరిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవ్యాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

13 October 2022, 13:26 IST

విచారణ వాయిదా…

మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితాపై నివేదికను సమర్పించాలని ఈసీని ఆదేశించింది. మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓట్ల కోసం భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.

13 October 2022, 12:52 IST

మునుగోడుకు కేటీఆర్…

మరికాసేపట్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు పార్టీ కార్య వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… మునుగోడుకు చేరుకున్నారు.  భారీగా కార్యకర్తలు, నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

13 October 2022, 10:49 IST

విమానంలో పొగలు

 గోవా నుంచి హైదరాబాద్​ వస్తున్న స్పైస్​ జెట్​ విమానంలో పొగలు కమ్ముకున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తోన్న 86 మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాదాపు 28 నిమిషాల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు.

 

13 October 2022, 10:48 IST

ఎంపీ వర్సెస్ ఎంపీ…

డెక్కన్ క్రానికల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఎంపీ ఎంవీవీ తీవ్రస్థాయిలో స్పందించారు. సొంత పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని సూటిగా పలు అంశాలపై ప్రశ్నించారు. ఇతరుల గురించి మాట్లాడేముందు మొదట తనకు అంటిని మురికిని కడుకోవాలంటూ సెటైర్లు విసిరారు.

తాను రాజకీయాల్లోకి రాకముందే నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను అని స్పష్టం చేశారు. ఎంపీ ప్రస్తావించిన ప్రాజెక్ట్ పై స్పందిచిన ఎంపీ ఎంవీవీ... హక్కుదారులు చాలా మంది తనని సంప్రదించారని... తాను ఎంపీగా లేనప్పుడు అంటే 2017లోనే పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కరించుకున్నామని స్పష్టం చేశారు.

ఎంపీ విజయసాయి దసపల్లా భూముల ఒప్పందాన్ని అంగీకరించినప్పడు... ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే నిర్ణయం వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఆయనలా కాకుండా... తన ప్రైవేటు భూమిలో ప్రాజెక్ట్ చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించలేదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కుమార్తె నగరంలో కొన్న భూమలు అంశాన్ని కూడా ప్రస్తావించారు ఎంపీ ఎంవీవీ. గెస్ట్ హౌస్ లో కూర్చొని ఆయన మనుషులు భూములు ఎలా తీసుకుంటున్నారో అందరికీ తెలుసుంటూ కామెంట్స్ చేశారు. ఆ భూముల్లో కొన్ని డి- పట్టాతో పాటు 22 ఏ జాబితాలోనూ ఉన్నాయని తెలిపారు.

13 October 2022, 10:00 IST

నేడు టీఆర్ఎస్ నామినేషన్….

ఇక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుంది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్  నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో నేడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు.

13 October 2022, 8:48 IST

టీడీపీ నేత అరెస్ట్….. 

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంపై సీఐడీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. బుధవారం రాత్రి సీఐడీ అరెస్ట్ చేసింది.

13 October 2022, 8:37 IST

హైకోర్టు విచారణ….. 

లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఎందుకని ఏపీ హైకోర్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై బుధవారం జరిపిన ఉన్నత న్యాయస్థానం.... ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించే విషయాన్ని పునఃపరిశీలించాలని సూచించింది. నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనపై దాఖలైన వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

13 October 2022, 8:07 IST

కుండపోత వాన….. 

హైదరాబాద్‌లో వర్షం మళ్లీ దంచికొట్టింది. బుధవారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. మరోవైపు పిడుగుల మోతతో నగరం దద్ధరిల్లిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఏ ఒక్క ప్రాంతాన్నీ వరుణుడు వదిలిపెట్టలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన వాన అర్ధరాత్రి 12 వరకు కురిసింది.

ఖైరతాబాద్, మాసాబ్‌ట్యాంక్, రాజేంద్రనగర్, బండ్లగూడ, మణికొండ, గండిపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేటతదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రసూల్‌పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చేరింది.

13 October 2022, 7:34 IST

మరో పెట్టుబడి…. 

singapore company investing 400 crore in telangana: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా సింగపూర్ కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్, ఫ్రీడమ్ ఆయిల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనుంది.

జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.400 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ సమీపంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి సమావేశమయ్యారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు కంపెనీకి కృతకజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.

13 October 2022, 7:09 IST

గ్రూప్ - 4 ఫలితాలు విడుదల… 

appsc group 4 results 2022 : గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ. జూలై 31న ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించగా... ఈ పరీక్షకు సంబంధించి స్క్రీనింగ్ ఫలితాలను వెల్లడించింది.

రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాలైన జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం జులై 31న నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది హాజరుకాగా.. 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నారు.

13 October 2022, 6:58 IST

విధుల్లోకి వీఆర్ఏలు….

వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో తెలంగాణ సీఎస్ సోమేశ్‌ కుమార్ నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి.  బుధవారం జరిగిన ఈ సమావేశంలో వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. పే స్కేలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌ను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తెలిపారు. అలాగే పదోన్నతులు ఇవ్వాలని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ ప్రతినిధులు కోరారు. సమస్యల పరిష్కారం కోరుతూ కొన్నిరోజులుగా వీఆర్‌ఏలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి వీఆర్ఏలు విధుల్లోకి రానున్నారు.

13 October 2022, 6:56 IST

రంగంలోకి టీ-టీడీపీ?

మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఓవైపు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. మండలాలు, వార్డుల వారీగా ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉండగా మునుగోడు బై పోల్‌లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఇవాళో, రేపో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా బీసీ వర్గానికి చెందిన ఐలయ్య ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీ నేతగా ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ నియోజకవర్గంలో బీసీ వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

13 October 2022, 6:55 IST

తగ్గిన బంగారం ధరలు…

Gold silver price today 13 october 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. ఇక బుధవారం ధరలు తగ్గగా... ఇవాళ కూడా అదే బాటలో నడిచింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 తగ్గగా... 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 దిగివచ్చింది.

ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,890గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,650 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండిపై రూ. 400 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.63,000గా ఉంది

    ఆర్టికల్ షేర్ చేయండి