August 27 Telugu News Updates: హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ
27 August 2022, 19:35 IST
- August 27 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..
నితిన్ - నడ్డా భేటీ
హైదరాబాద్ నోవాటెల్ హెటల్ లో హీరో నితిన్ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాసేపట్లో నడ్డా - నితీన్ భేటీ
జేపీ నడ్డా శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. కాసేపట్లో హీరో నితిన్ తో భేటీ కానున్నారు.
భూమి కూడా కేటాయించలేదు - కిషన్ రెడ్డి
వరంగల్ జిల్లాలోని ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళామండపాన్ని పట్టించుకోలేదన్న ఆయన... కాకతీయుల కళామండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోందన్నారు. వరంగల్ జిల్లాకు కేంద్రప్రభుత్వం సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసిందని గుర్తు చేశారు. గిరిజన యూనివర్సిటీ కోసం కూడా టీఆర్ఎస్ సర్కార్ భూమి కేటాయించటం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 రిజర్వేషన్లు ఇస్తామని...రాష్ట్రంలోని మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని చెప్పారు.
కేసీఆర్ ను జైల్లో పెడుతాం - బండి సంజయ్
బీజేపీ కార్యకర్తలను కేసీఆర్ జైల్లో పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమని జైల్లో పెట్టిన కేసీఆర్ ను కూడా... జైల్లో పెడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ చర్యలతో రక్తం సలసల మరుగుతోందని వ్యాఖ్యానించారు.
'బీజేపీ ఎప్పుడు మతతత్వాన్ని రెచ్చగొట్టలేదు. బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కేసులతో కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. దేనికి భయపడేదిలేదు. తెగించి కొట్లాడుతాం - బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు
నడ్డా ఫైర్
హన్మకొండలో బీజేపీ తలపెట్టిన సభను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేసిందని నడ్డా ఆరోపించారు. కోర్టు అనుమతిలో సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.
నడ్డా హాజరు
bjp public meeting at hanamkonda: హన్మకొండ వేదికహా బీజేపీ భారీ బహిరంగ సభను తలపెట్టింది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. వరంగల్ గడ్డకు నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
కిమ్ తో పోల్చటం సరికాదు - సీపీఐ నారాయణ
సీఎం జగన్ ను చంద్రబాబు కిమ్ తో పోల్చటంపై సీపీఐ నారాయణ స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు సరికావన్నారు. జగన్ (Jagan)కి, కిమ్‌కు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. అమెరికా లాంటి సామ్రాజ్యవాదాన్ని కిమ్ (Kim) గడగడలాడించారని, మురికిగుంటల్లో చేపలు పట్టుకునే జగన్ లాంటి వాళ్లతో కిమ్ ను పోల్చడం సరికాదని తప్పుబట్టారు.
వెంకటనారాయణ ఇంటికి నడ్డా
వరంగల్ లోని ఉద్యమకారుడు వెంకటనారాయణకు ఇంటికి వెళ్లారు జేపీ నడ్డా. ఆయనతో కాసేపు మాట్లాడి… రాష్ట్రంలోని పరిస్థితులు, టీఆర్ఎస్ పాలన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
మంత్రి, ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి - రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగాలిచ్చారని లేఖలో ప్రస్తావించారు. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే, మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ కుట్ర చేసింది - ఎంపీ అసదుద్దీన్
తెలంగాణ, హైదరాబాద్ పై బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు ఎంపీ అసదుద్ధీన్. రాజాసింగ్ కు ఇప్పటికీ బీజేపీ మద్దతు ఉందని వ్యాఖ్యానించారు.
కొత్త స్కీమే బెటర్ - మంత్రి బొత్స
కొత్త స్కీమ్ సీపీఎస్ ను మించి ఉంటుందన్నారు ఏపీ మంత్రి బొత్స. సమస్యలపై పోరాడే హక్కు ఉద్యోగ సంఘాలకు ఉందని తెలిపారు. సీఎం ఇంటి ముట్టడికి పిలునిస్తే ఊరుకుంటామా అంటూ ఓ ప్రశ్నలకు బదులిచ్చారు.
రేవంత్ రెడ్డిపై విష్ణు ఫైర్
రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం మైనర్ పై రేప్ జరిగిందన్న వ్యాఖ్యలు సరికావని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన.. రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు.
ముగిసిన యాత్ర
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది. వరంగల్ కు చేరుకున్న ఆయన.. నడ్డాతో కలిసి భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
వరంగల్ చేరుకున్న జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
దొంగల బీభత్సం….
హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా కారంపొడి చల్లి ఇంటికి నిప్పంటించి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
వరంగల్ బయల్దేరిన జేపీ నడ్డా
హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా నోవాటెల్ హోటల్ లో పలువురితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం హెలికాప్టర్ లో వరంగల్ బయల్దేరారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం 4 గం.కు బహిరంగ సభలో పాల్గొంటారు.
జేపీ నడ్డాకు ఘన స్వాగతం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నేతలు ఘన స్వాగతం పలికారు.
ప్రగతి భవన్ లో జాతీయ రైతు సదస్సు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు జరుగనుంది. ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు.
కొత్తగా 9,520 కొవిడ్ కేసులు
దేశంలో కొత్తగా 9,520 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
తుంగభద్రకు భారీ వరద
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
రేపు కానిస్టేబుల్ పరీక్ష
Constable Exam in Telangana: రేపు రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హాల్‌టికెట్‌లు డౌన్లోడ్ చేసుకున్న, అభ్యుర్థులు హాల్‌టికెట్‌పై ఫొటో అతికిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
నడ్డా షెడ్యూల్
jp nadda to meet hero nithin: మధ్యాహ్నం హైదరాబాద్ కు రానున్న జేపీ నడ్డా హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరకుంటారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రొఫెసర్ వెంకటనారాయణతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు. నోవాటెల్‌లో సినీ హీరో నితిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు.
బీజేపీ సభ
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది బీజేపీ. దాదాపు 2 లక్షలకు పైగా జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఆరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమై బహిరంగ సభకు భారీగా జనాన్ని తరలించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరుకానున్నారు.