September 24 Telugu news Updates : భారత్ ఆసీస్ మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
24 September 2022, 22:09 IST
- Today Telugu News Updates: సెప్టెంబర్ 24 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి
ప్రత్యేక బస్సులు
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ బస్సులను నడిపించనున్నారు. ఉప్పల్ రూట్, హయత్ నగర్, ఎన్.జీ.ఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోటి, దిల్సుఖ్నగర్, అఫ్జల్‌గంజ్,మెహదీపట్నం-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉప్పల్ రూట్, ఘట్కేసర్-రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బీహెచ్.ఈఎల్, జీడిమెట్ల, కేపీహెచ్బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, యూసఫ్‌గూడ, బోయిన్పల్లి, చార్మినార్, చంద్రాయణగుట్ట, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
ముగ్గురు మృతి….
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. నల్లకుంటలో పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఆగని లోన్ యాప్ వేధింపులు….
Student Suicide In Nandyal: లోన్ యాప్ వేధింపులకు ఓ విద్యార్థి బలయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. నగునూరుకు చెందిన శ్రీధర్-పధ్మ దంపతుల కుమారుడు మని సాయిది ఇటీవల ఇంటర్ పూర్తి అయింది. ఎంసెట్ లోనూ మంచి ర్యాంక్ సాధించాడు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చాడు.ఇదిలా ఉంటే... అవసరాల కోసం లోన్ యాప్ లో రూ. 10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమేర కట్టినప్పటికీ లోన్ యాప్ నిర్వహకులు వేధింపులకు పాల్పడినట్లు సమచారం. దీంతో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఈనెల 20న శంషాబాద్‌లోని తన రూమ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా... చికిత్స అందించారు. అయితే శుక్రవారం మునిసాయి మృతి చెందాడు.
బతుకమ్మ శుభాకాంక్షలు..
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు.. పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు.
బ్రహ్మోత్సవాలపై ఈవో సమీక్ష
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో విభాగాల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భక్తుల సమక్షంలో వాహనసేవలు జరుగనున్నాయని తెలిపారు. ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని కోరారు. విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
| స్విమ్మింగ్ పూల్‌లో గర్బా డాన్స్…
నవరాత్రి...ఈ తొమ్మిదిరోజుల్లో రోజుకో విశిష్టత కలిగి ఉంటుంది. ఉత్తర భారత దేశంలో యువతులు నవరాత్రి సంబరాల్లో భాగంగా గర్బా, దాండియా నృత్యం చేస్తుంటారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈసారి నవరాత్రి వేడుకలకు ఘనంగా జరిపేందుకు దేశ ప్రజలు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఓ స్విమ్మింగ్ పూల్ లో గర్బా డాన్స్ ఈవెంట్ ను నిర్వహించారు. నీటి లోపల గర్బా బీట్ లకు స్టెప్పులు వేశారు. వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైరల్ గా మారింది.
సోమిరెడ్డి ఫైర్….
రాష్ట్ర శాసనసభ సాక్షిగా రైతులకోసం ఖర్చుచేసినట్లుగా చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన తప్పుడు గణాంకాలకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అబద్ధాలు చెప్పేందుకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ సాక్షి గా జగన్ రెడ్డి చేసిన వక్రీకరణలను పత్రికల్లో ప్రచురించడానికి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించడం దుర్మార్గం అని ఫైర్ అయ్యారు.
ప్రత్యేక రైళ్లు….
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ - యశ్వంతపూర్, నాందేడ్ - పూరీ, పూరీ - నాందేడ్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది ఈ వివరాలను చూస్తే.... secundrabad tirupati trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. సెప్టెంబర్ 25వ తేదీన సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 05.50 నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.20 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 26వ తేదీన రాత్రి 08.15 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.20 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
గుడివాడలో యాత్ర…
అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలోకి ప్రవేశించింది. గుడివాడలో యాత్ర రాకతో పోలీసులు బారీగా మోహరించారు.
గుడివాడలో టెన్షన్…
కాసేపట్లో గుడివాడ (Gudivada)కు రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) చేరుకోనుంది. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
నో ఎంట్రీ…..
India vs Australia Cricket Match at Hyderabad: రేపు భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నగర పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ప్రజలు ఇబ్బందిపడకుండా.... ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవసరం ఉంటే తప్ప బయటకు అడుగు వేయొద్దని స్పష్టం చేశారు. స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
ఆదివారం జరిగే మ్యాచ్ కు దాదాపుగా 40 వేలకు పైగా క్రీడాభిమానులు మ్యాచ్ వీక్షించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ఉప్పల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు స్డేడియంలో ఎలాంటి వస్తువులు తీసుకురావాలనే అనే దానిపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్, కెమెరాలు, ల్యాప్‌ట్యాప్‌లు, సిగరెట్లు, తినుబండారాలు తీసుకురావొద్దు. ఆల్కహాల్ / మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్,బైనాక్యులర్స్, ఆయుధాలు, బ్లేడ్లు, చాకులు, మంచి నీటి బాటిల్స్‌ను స్టేడియంలోకి అనుమతించరు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ దందా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
ఖట్మాండ్ టూర్….
irctc tourism announced kathmandu tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా విశాఖ నుంచి నేపాల్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'CENIC BEAUTY OF NEPAL EX VISHAKHAPATNAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఖట్మాండ్,పొకారాతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.ఈ నెల నవంబర్ 24వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
దసరా ఉత్సవాల్లో పది లక్షల మందికి దర్శనం
దసరా ఉత్సవాల్లో పది లక్షల మందికి దర్శనం కల్పిస్తామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ చెప్పారు. ఈ ఏడాది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.300, రూ.100, వీఐపీ, రెండు ఉచిత దర్శన క్యూలైన్లు ఘాట్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశామన్నారు. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి వచ్చిన భక్తులు ఘాట్ రోడ్డు మార్గంలో దర్శనం చేసుకొని మల్లేశ్వరాలయ మెట్ల మార్గం ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది దసరా సమయంలో అన్నదానం రద్దు చేశారు. దానికి బదులు భోజనం ప్యాకెట్లను భక్తులకు అంద చేస్తారు.
రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే విరాళం
అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా రూ .5 లక్షల చెక్కును పిన్నమనేని అందచేశారు. రైతుల యాత్రకు రూ.5 లక్షల చెక్కును పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాజ్జి అందచేశారు. పాదయాత్రలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, పిన్నమనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రానికి రైతుల మహాపాదయాత్ర గుడివాడ చేరుకోనుంది .
చింతమనేని ఇంటిని ముట్టడించిన పోలీసులు
ప.గో జిల్లా దెందలూరులో చింతమనేని ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అమరావతి పాదయాత్రకు వెళ్లొద్దంటూ చింతమనేనిపై ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు.
వైజాగ్ హార్బర్ ను ముట్టడించిన మత్స్యకారులు
వైజాగ్ హార్బర్‍లోని కంటైనర్ టెర్మినల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టెర్మినల్ ముట్టడికి మత్స్యకార నేతల పిలుపునిచ్చారు. టెర్మినల్ మెయిన్ గేట్ దగ్గరకు మత్స్యకారులు చేరుకుంటున్నారు. షిప్‍లు వచ్చే మార్గంలో బోట్లు అడ్డు పెట్టి నిరసన తెలిపారు. 15 ఏళ్లుగా తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
అనకాపల్లిలో ఉద్రిక్తత
అనకాపల్లి జిల్లాలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకరావుపేటలో ఎమ్మెల్యే బాబురావుకు అసమ్మతి పోరు మళ్లీ మొదలైంది. ఎస్.రాయవరం మండలం గుడివాడలో శంకుస్థాపనకు వచ్చిన గొల్ల బాబూరావును అసమ్మతి వర్గం అడ్డుకుంది. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును ఎంపీటీసులు, సర్పంచులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహన శ్రేణిని అడ్డుకున్నారు. పోలీసు వాహనం ముందు సర్పంచ్ శ్రీనుబాబు, అప్పలరాజు బైఠాయించారు. ప్రోటోకాల్ విషయమై సొంత పార్టీలోనే ఎమ్మెల్యేతో విభేదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేతో విభేదించి నిన్న ఎంపీపీ పదవికి శారదాదేవి రాజీనామా చేశారు.
హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై బాలకృష్ణ ట్వీట్
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదని, ఓ సంస్కృతి.. ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అని పేర్కొన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారని, కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారుని, మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారని చెప్పారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అని, అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్ - శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు.
తిరుమలలో రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లుగా ఉంది. శుక్రవారం 65,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,416 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
లారీ డ్రైవర్పై బ్లేడ్ బ్యాచ్ దాడి
విజయవాడ శివార్లలోని గూడవల్లి హైవేపై బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేసింది. లారీ డ్రైవర్పై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసి రూ.5 వేలు, సెల్‍ఫోన్ ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన డ్రైవర్ సలీమ్ పరిస్థితి విషమంగా ఉంది. 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
బీజేపీ కార్యాలయాలపై దాడులు
తమిళనాడులో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. - బీజేపీ నేతల కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. ఆరు జిల్లాల్లో కార్లకు దుండగులు నిప్పంటించారు. కోయంబత్తూరు, ఈరోడ్, దిండికల్, రామనాథపురం జిల్లాలతో సహా పలుచోట్ల దాడులు జరిగాయి.
26 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
రాష్ట్రంలోని పాఠశాలలకు ఆదివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26 నుంచి అక్టోబరు 6 వరకు 11 రోజులు దసరా సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ గతంలో సెలవులు ప్రకటించింది. 25న ఆదివారం కావడంతో అదనంగా ఒకరోజు సెలవు వచ్చింది. ఆదివారంతో కలిపి సెలవులు 12 రోజులు ఉంటాయి. అక్టోబరు 7 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు అక్టోబరు 2 నుంచి 9 వరకు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే వెల్లడించింది. 10న కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర
అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో కొనసాగుతోంది. కౌతవరం నుంచి గుడివాడ వరకు అమరావతి రైతుల పాదయాత్ర నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులకు సంఘీభావంగా తరలి వస్తున్నారు. రాజధాని గ్రామాల నుంచి వస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అఢ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. యాత్రలో పాల్గొంటున్న వారి ఆధార్ కార్డు, ఇతర వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అమరావతి యాత్ర లో పరిమితి కి మించి ఉన్నారంటూ ఆంక్షలు విధిస్తున్నారు. గుడివాడ వైపు అనుమతి లేదంటూ వెనక్కి పంపుతున్నారు. కంకిపాడు టోల్ గేట్ వద్ద రైతులు వస్తున్న ఆటోలను పోలీసులు నిలిపివేశారు. ఆటోల్లో ఉన్నవారిని కంకిపాడు పోలీస్టేషన్ లో ఉంచారు.