తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Nit: వరంగల్ నిట్ లో టెక్నికల్ ఫెస్ట్ మూడు రోజులపాటు టెక్నోజియాన్ వేడుకలు

Warangal NIT: వరంగల్ నిట్ లో టెక్నికల్ ఫెస్ట్ మూడు రోజులపాటు టెక్నోజియాన్ వేడుకలు

HT Telugu Desk HT Telugu

19 January 2024, 7:37 IST

google News
    • Warangal NIT: వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ ఐటీ) లో టెక్నీకల్ ఫెస్టివల్ జరగనుంది.
వరంగల్‌ నిట్‌లో టెక్నో ఫెస్ట్
వరంగల్‌ నిట్‌లో టెక్నో ఫెస్ట్

వరంగల్‌ నిట్‌లో టెక్నో ఫెస్ట్

Warangal NIT: దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థలకు చెందిన యువ సైంటిస్టులు, విద్యార్థుల ప్రయోగాలు, ఆలోచనలకు వరంగల్ నిట్ వేదికగా నిలువనుంది. ప్రతి సంవత్సరం జరిగే టెక్నోజియాన్ వేడుకలను జనవరి 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్సిటీలు, సాంకేతిక విద్యాలయాలకు చెందిన సుమారు 3 వేల మంది ఈ టెక్నీకల్ ఫెస్ట్ కు తరలిరానున్నారు. మొత్తం 40 కి పైగా సాంకేతిక అంశాల్లో ప్రదర్శనలు జరగనుండగా.. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ బిద్యాధర్ సుభూది వెల్లడించారు.

ఇన్ జీనియస్ థీమ్

ప్రతి సంవత్సరం టెక్నోజియాన్ వేడుకలను ఒక్కో థీమ్ తో నిర్వహిస్తుంటారు. ఆ థీమ్ కు తగ్గట్టుగా అందులో ఎగ్జిబిట్స్, ప్రయోగాలను ప్రదర్శిస్తుంటారు. సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఆటలు కూడా ఇందులో నిర్వహిస్తారు. కాగా ఈసారి ఇన్ జీనియస్ అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు.

ఈ థీమ్ కు తగ్గట్టుగా వివిధ సాంకేతిక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ముఖ్యంగా జహాజ్, ఆర్సీ బగ్గీ, హోవర్ మేనియా, వర్చువల్ రియాలిటీ, డీ బగ్గింగ్ మేనియా తదితర స్పాట్ లైట్ ఈవెంట్లతో పాటు మత్లబ్, ర్యాపిడ్ ప్రోటో టైపింగ్, సిమ్యులింక్ మాస్టర్, ఇన్నో సెర్చ్ మొదలైన వాటిపై వర్క్ షాప్స్ కూడా ఉంటాయి.

అంతేకాకుండా మొదటి రెండు రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్ పరిధిలో వివిధ సాంకేతిక కార్యక్రమాలతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. మొత్తంగా టెక్నోజియాన్ లో దాదాపు 40 టెక్నీకల్ ఈవెంట్లు జరగనున్నాయి. ముఖ్యంగా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన స్పర్ధక్ టీమ్ రూపొందించిన వెహికిల్ ను ప్రదర్శించనున్నారు.

వివిధ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ తమ అవిష్కరణలను ప్రదర్శించనుండగా స్థానిక పాఠశాలల విద్యార్థులు కూడా భాగస్వాములు కానున్నారు.

అతిథులుగా ప్రముఖ సైంటిస్టులు

ఈ ఏడాది టెక్నోజియన్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ శ్రీనివాసన్‌ సుందరరాజన్ హాజరవనున్నారు. ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్ మరియు త్రిశూల్ వంటి ప్రతిష్టాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో పనిచేసిన ప్రఖ్యాత ఏరోస్పేస్, మిస్సైల్ సైంటిస్ట్.

ప్రస్తుతం, ప్రొఫెసర్ సుందరరాజన్ ఉన్నత విద్య, రక్షణ ఏరోస్పేస్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనతో పాటు 'రెడ్ బస్' సీఈవో ప్రకాష్ సంగం, ఇస్రో సైంటిస్ట్ టీఎన్ సురేష్ కుమార్, వంశీ కూరపాటి లాంటి వక్తలు విద్యార్థులకు వినూత్న నైపుణ్యాలను పెంపొందించడానికి అవగాహన కల్పించనున్నారు.

విద్యార్థుల చేతుల మీదుగానే నిర్వహణ

ప్రతిసారి టెక్నోజియాన్ వేడుకలను నిట్ ప్రొఫెసర్లు, ఇతర అధికారులే నిర్వహించేవారు. కానీ ఈసారి ఎగ్జిబిట్ల నుంచి నిర్వహణ దాకా అంతా స్టూడెంట్ల చేతుల మీదుగానే నడిపించనున్నారు. ఈ మేరకు నలుగురు విద్యార్థులకు కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. టెక్నోజియాన్ ను ఈవెంట్ బట్టి నాలుగు విభాగాలుగా చేసి, ఒక్కో విభాగానికి ఒక్కో స్టూడెంట్ కు కో ఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చారు.

శుక్రవారం సాయంత్రం మొదలు కానున్న ఈ టెక్నోజియాన్ ఆదివారం వరకు కొనసాగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సాంకేతిక ఉత్సవంలో పాల్గొనేందుకు దేశంలోని ఇతర ఎన్ఐటీ లు, ఇతర విద్యాసంస్థల స్టూడెంట్స్ తరలిరానుండగా.. వరంగల్ ఎన్ ఐటీ క్యాంపస్ కళకళలాడనుంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం