ISB Chandra Babu :ప్రజల భవిష్యత్ ను మార్చేలా ప్రభుత్వ పాలసీలు ఉండాలన్న చంద్రబాబు
17 December 2022, 7:11 IST
- ISB Chandra Babu తిరుగులేని యువశక్తి భారత్‌ను అగ్రగామి దేశం చేస్తుందని, విజన్‌తో నాడు తీసుకున్న నిర్ణయాలతో నేడు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ISB క్యాంపస్ వద్ద చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు, ఫ్యాకల్టీ, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ISB ఏర్పాటు, ప్రస్థానం, విజయాలపై జరిపిన చర్చలో టిడిపి అధినేత పాల్గొన్నారు.
ఐఎస్‌బి 20వ వార్షికోత్సవ వేడుకల్లో చంద్రబాబు
ISB Chandra Babu భారత్ కు ఉన్న యువశక్తి 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజన్ తో సాగించే పరిపాలన, తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయన్నారు. నాడు విజన్ తో హైదరాబాద్ లోచేపట్టిన ప్రతి కార్యక్రమం, నిర్ణయం ఇప్పుడు ఫలితాలను ఇస్తూ...ఉదాహరణగా నిలుస్తున్నాయని తెలిపారు. ఒక విజన్ తో తమ ప్రయాణం చేస్తే ఎవరైనా లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు.
విజన్ 2020 గురించి మాట్లాడితే విజన్ అంటే ఏంటి అని అంతా ప్రశ్నించారని, కొందరు హేళన చేశారని... ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ది, వచ్చిన ఫలితాలపై ఏం చెబుతారని ప్రశ్నించారు. ISB 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ISB ఆవిర్భావం, ప్రస్థానం, సాధించిన విజయాలు వంటి అంశాలపై చర్చించారు.
"నాడు విజన్ రూపంలో మనం ఊహించింది అంతా ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ISB ఏర్పాటైన ప్రాంతంలో నాడు ఎటువంటి అభివృద్ది లేదని ...కేవలం హైదరాబాద్ యూనివర్సిటీ ఉండేదని ...అయితే తరవాత కాలంలో పెను మార్పులు వచ్చాయన్నారు. నాడు పట్టుబట్టి జాతీయ క్రీడలు ఇక్కడ నిర్వహించామని, అందు కోసం క్రీడానగరాన్ని నిర్మించామని బాబు చెప్పారు. ఈ ప్రాంతం రూపురేఖలు ఇప్పుడు మారిపోయాయని ఇండియా ఒలంపిక్స్ కూడా నిర్వహించగలదు అనే నమ్మకం నాడు దేశానికి జాతీయ క్రీడల నిర్వహణ అనంతరం లభించిందన్నారు.
భవిష్యత్ లో ఐటికి ఉన్న ప్రాధాన్యం గుర్తించి మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చానని, మైక్రో సాఫ్ట్ కోసం 45 నిముషాలు పాటు బిల్ గేట్స్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పారు. భారత దేశ బలా బలాలు వివరించానని, హైదరాబాద్‌లో సంస్థను ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు. భారతీయులు మ్యాథ్స్ లో నిష్ణాతులని మరో వైపు బ్రిటీష్ వారు మనకు ఇంగ్లీష్ మిగిల్చి వెళ్లారని ఇవి రెండు మాకు ఉన్న బలం అని బిల్ గేట్స్ కు వివరించాని చెప్పారు.
మైక్రోసాఫ్ట్ ఏర్పాటు కోసం తరువాత పలుమార్లు చర్చలు జరిపానని కేవలం స్నేహంతో మైక్రోసాఫ్ట్ ను ఇక్కడికి తీసుకురాగలిగానని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వస్తే అన్ని కంపెనీలు వస్తాయనే నమ్మకం వమ్ము కాలేదన్నారు. తన ప్రయత్నాల తరువాత అమెరికా వెలుపల తొలిసారి మైక్రోసాఫ్ కార్యాలయం పెట్టారని అలా వచ్చిన మైక్రోసాఫ్ట్ సంస్థకు నేడు ఒక ఇండియన్ సిఈవో గా ఉన్నారని చెప్పారు.
మైక్రోసాఫ్ట్ రావడంతో ఇతర సంస్థలు కూడా హైదరాబాద్ కు వచ్చాయన్నారు. ISB ను హైదరాబాద్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశామమని గుర్తు చేశారు. సంస్థ ఏర్పాటుపై చర్చలు, ప్రతిపాదనల సమయంలో ISB ప్రతినిధులను ఆహ్వానించి గౌరవించానని చెప్పారు. అతిథి మర్యాదలతో ISB ప్రతినిధులను ఆకట్టుకునే ప్రయత్నం చేశానని హైదరాబాద్ కు ఉన్న వసతులు, ప్రభుత్వ పరంగా తాము ఇచ్చే మద్దతుపై వివరించాను. దీంతో ఇతర రాష్ట్రాల కంటే ఎపిలో సంస్థను ఏర్పాటుచెయ్యాలని నాడు నిర్ణయించారన్నారు.
ఇతర రాష్ట్రాలు కూడా పోటీపడినా నాడు చాణక్యంతో ISB ఇక్కడికి తీసుకువచ్చానని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ ఫ్యూచర్ నాలెడ్జ్ హబ్ అని నాడు ప్రజెంటేషన్ ఇచ్చానని ఇప్పుడు అదే నిజం అయ్యిందన్నారు. నాటి నా ప్రోత్సాహంతో జినోంవ్యాలీ వచ్చిందని ఈ కారణంగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇక్కడ తయారు అయ్యిందన్నారు. నాడు తీసుకున్న పాలసీలన్నీ తరవాత మంచి ఫలితాలు ఇచ్చాయని, పాలసీలను కంటిన్యూ చేసిన చోట ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.
ఏపీ కోసం విజన్ 2029….
విభజన తరువాత ఎపి కోసం విజన్ 2029 సిద్దం చేశానని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు అనుకూలంగా మారితే... ఏపికి ఇరిగేషన్, కోస్టల్ ప్రాంతం అనుకూలంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ ను మించిన నగరంగా అమరావతి చేయాలని ప్రణాళికలు చేశానన్నారు. పబ్లిక్ పాలసీలు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తెస్తాయని గట్టిగా నమ్ముతానన్నారు. 2014 తరువాత నాటి పాలసీల కారణంగా ఎపిలో 10 శాతానికి మించి గ్రోత్ రేట్ సాధించామన్నారు. పాలసీలు తెచ్చిన విజయమని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు నన్ను గుర్తించుకోక పోవచ్చని, తాను ఏం చేశాను అనేది నాకు ఎప్పటికీ ఎంతో తృప్తినిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు.