తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rohit Reddy Attends Ed Enquiry : ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి

Rohit Reddy Attends ED Enquiry : ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu

19 December 2022, 17:16 IST

google News
    • Rohit Reddy Attends ED Enquiry : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ తో సమావేశమైన అనంతరం.. ప్రగతి భవన్ నుంచే నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆర్థిక లావాదేవీలపై రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

Rohit Reddy Attends ED Enquiry : నాటకీయ పరిణామాల మధ్య తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రెడ్డి.. విచారణ కోసం లోపలికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో ఆయనని ఈడీ అధికారులు పలు అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలపైనా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. తనతో పాటు బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులు - కంపెనీల వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారం పై ప్రశ్నలు అడుగుతున్నట్లుగా సమాచారం. వ్యాపారవేత్త కళహర్ రెడ్డితో సంబంధాలపైనా పలు ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది.

విచారణకు ఎందుకు పిలిచారో తెలియదని.. చట్టానికి గౌరవం ఇచ్చే వ్యక్తిగా ఈడీకి పూర్తిగా సహకరిస్తానని... ఈడీ కార్యాలయానికి వెళ్లేముందు రోహిత్ రెడ్డి తెలిపారు. కేసుకి సంబంధించిన వివరాలు ఇవ్వలేదని... వారు కోరిన సమాచారం ఇచ్చేందుకు డిసెంబర్ 31 వరకు సమయం కావాలని అడిగానని చెప్పారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని... ఈ వారం పడి పూజ ఉందని కూడా చెప్పానని అన్నారు. అయినా ఈడీ అధికారులు నిరాకరించారని.. విచారణకు హాజరుకావాల్సిందే అని చెప్పారని పేర్కొన్నారు. దీంతో.. చట్టం మీద గౌరవంతో ఈడీ విచారణకు వచ్చానని చెప్పి... కార్యాలయంలోకి వెళ్లారు.

అంతకముందు రోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అన్న విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 10:30 నిమిషాలకు మణికొండలోని తన నివాసం నుంచి బయలు దేరిన రోహిత్ రెడ్డి.. నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ పీఏతో ఈడీకి సమాచారం పంపారు. అయ్యప్ప మాలలో ఉన్నానని.. నోటీసుల్లో పేర్కొన్న సమాచారం మొత్తం ఇవ్వడానికి గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు విచారణ నిమిత్తం హైదరాబాద్ లోని కార్యాలయానికి రావాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో.. ప్రగతి భవన్ నుంచే నేరుగా రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

కాగా.. పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ గతవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 19న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఆదివారం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద పూజలు చేసిన రోహిత్ రెడ్డి... బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. డ్రగ్స్‌కేసుకి సంబంధించి బీజేపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.

తదుపరి వ్యాసం