తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hanumakonda : అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి.. డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు

Hanumakonda : అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానాస్పద మృతి.. డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు

HT Telugu Desk HT Telugu

23 December 2024, 17:47 IST

google News
    • Hanumakonda : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. ఉద్యోగం సాధించి తమకు అండగా ఉంటాడని కొడుకును అమెరికాకు పంపిస్తే.. అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయాడని అతని తల్లిదండ్రులు రోధిస్తున్నారు
బండి వంశీ
బండి వంశీ

బండి వంశీ

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో చెందిన బండి రాజయ్య, లలిత దంపతులు నివసిస్తున్నారు. వీరు వ్యవసాయంతో పాటు కల్లు గీత వృత్తిపై ఆధార పడి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకైన బండి వంశీ (25) రెండు సంవత్సరాల కిందట ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా సెయింట్ పాల్ యూనివర్సిటీలో చదువుతూ.. మాగ్నోలియా ట్రైల్ కామా ఈడెన్ ప్రెయిరీ అపార్ట్‌మెంట్ రూం నెంబర్ 206లో ఉంటున్నాడు.

అనుమానాస్పద మృతి..

రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న బండి వంశీ.. అడపా దడపా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. శనివారం రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ బండి వంశీ అమెరికాలోని తన అపార్ట్‌మెంట్ కింద సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న కారులో ఉరి వేసిన స్థితిలో కనిపించాడు. అనుమానాస్పదంగా మరణించడంతో వంశీ స్నేహితులు మాదన్నపేటలోని ఆయన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నత చదువులు చదివి తమకు పట్టెడన్నం పెడతానుకున్న కొడుకు మరణించడంతో.. తల్లిదండ్రులు బండి రాజయ్య, లలిత దంపతులు తీవ్రంగా రోధించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో.. మాదన్నపేటలో విషాదం నెలకొంది.

ఎదురుచూపులు..

బండి వంశీ అమెరికాలో మృతిచెందగా.. ఆయన డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చే మార్గం తెలియక ఆయన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వంశీ చావుకు కారణమైన వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడాలని వేడుకుంటున్నారు.

వంశీ అనుమానాస్పద మృతి విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. వంశీ మృతదేహాన్ని మాదన్నపేటకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వంశీ డెడ్ బాడీని స్వగ్రామం మాదన్నపేటకు తీసుకొచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని.. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఒడితెల ప్రణవ్ స్పష్టం చేశారు. వంశీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, వంశీ డెడ్ బాడీని తీసుకొస్తామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం