Hanmakonda Child Death: హనుమకొండలో మూడు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి, విషప్రయోగంపై అనుమానాలు..
25 November 2024, 9:00 IST
- Hanmakonda Child Death: హనుమకొండ జిల్లాలో మూడు నెలల చిన్నారి అనుమానాస్పదంగా మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో సడెన్ గా నోట్లో నుంచి నురగలు రావడంతో పేరెంట్స్ చిన్నారిని అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
హనుమకొండలో మూడు నెలల చిన్నారి మృతి
Hanmakonda Child Death: హనుమకొండలో ముక్కుపచ్చలారని చిన్నారి మరణం కలకలం రేపుతోంది. ముక్కు పచ్చలారని చిన్నారి నోట్లో నుంచి నురగలు మరణించడంతో అది హత్యా.. లేక మరేదైనా కారణమా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా చిన్నారి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని గుండ్ల సింగారం జై భవాని కాలనీకి చెందిన మేకల అనూష, శ్రీధర్ రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు మూడేళ్ల బాబు కాగా మరొకరు మూడు నెలల పాప. వీరి స్వగ్రామం హసన్ పర్తి మండలంలోని పెగడపల్లి కాగా కొంతకాలంగా జై భవానీ కాలనీలోని ఉంటున్నారు.
ఇంతవరకు బాగానే ఉండగా.. ఈ నెల 10వ తేదీన వారి స్వగ్రామంలో దేవుడి పండుగ కోసమని సొంతింటికి వెళ్లారు. ఈ క్రమంలో అనూష తన మూడేళ్ల కూతురును తన తోటి కోడలైన మౌనికకు ఇచ్చి బట్టలు ఉతికేందుకని బంగ్లా పైకి వెళ్లింది. కొద్దిసేపటికే ఆ చిన్నారి కేకలు వేస్తూ బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది.
విష ప్రయోగం జరిగిందా అనే అనుమానాలు
తన కూతురు ఏడుపు విన్న అనూష వెంటనే కిందికి వచ్చింది. అప్పటికే చిన్నారి గావుకేక పెట్టీ ఏడుస్తుండటంతో పరుగున వచ్చిన తల్లి అనూష పరీక్షించి చూడగా.. ఆ చిన్నారి నోట్లో నుంచి నురగలు రావడంతో పాటు నాలుకపై చిన్న చిన్న పొక్కులుగా ఉండటాన్ని గమనించింది. వెంటనే చిన్నారి హనుమకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
దీంతో పరీక్షించిన అక్కడి డాక్టర్లు గుర్తు తెలియని పాయిజన్ లిక్విడ్ ఏదైనా తాగి ఉండొచ్చు అని అనుమానించారు. అక్కడ చిన్నారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయినా సమస్య తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఈ నెల 12న చిన్నారిని హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అందులో అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు దాదాపు పది రోజుల పాటు చికిత్స అందించారు. అయినా చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడక.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది.
దీంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు మూడు నెలలకే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగింది. కాగా చిన్నారి మరణం పట్ల కుటుంబ సభ్యులు హత్య గా అనుమానం వ్యక్తం చేస్తుండటం.. గ్రామంలో కూడా గొడవలు జరిగే అవకాశం అవకాశం ఉండటంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు రెండు రోజులుగా పెగడపల్లి గ్రామంపై ఫోకస్ పెట్టీ అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)