తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp On Raja Singh Suspension : రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

BJP On Raja Singh Suspension : రాజా సింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

22 October 2023, 12:01 IST

google News
    • Telangana Assembly Elections 2023 : రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది బీజేపీ. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత

రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత

BJP On Raja Singh Suspension : తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం…. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తుండగా…. గోషామహల్ నుంచి మళ్లీ రాజాసింగ్ కే చోటు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

గతేడాది ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానూ తీవ్ర దుమారానికి దారితీశాయి. అయితే అప్పటి పరిస్థితులతో బీజేపీ జాతీయ నాయకత్వం… ఆయనపై సస్పెన్షన్ విధించింది. నాటి నుంచి ఇవాళ్టి వరకు సస్పెన్షన్ ఆదేశాలు అమల్లో ఉండటంతో…. పార్టీకి సంబంధం లేకుండానే పని చేసుకుంటూ వెళ్తున్నారు రాజాసింగ్.

ఇక గత కొంతకాలంగా తనపై విధించిన సస్పెన్షన్ విషయంలోనూ రాజాసింగ్ పలుమార్లు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కూడా కోరారు. అయితే రాష్ట్ర నాయకత్వం సుముఖంగానే స్పందించినప్పటికీ… జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈనేపథ్యంలో… రాజాసింగ్ పార్టీ మారుతారనే చర్చ జరిగింది. వీటిన్ని తీవ్రంగా ఖండించారు రాజాసింగ్. అవసరమైతే రాజకీయాల నుంచి వైదొలుగుతా కానీ… వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో…. ఇదే టికెట్ నుంచి పోటీ చేయాలని పార్టీకి చెందిన విక్రమ్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈసారి రాజాసింగ్ బరిలో ఉండకపోవచ్చనే చర్చ నడిచింది. కానీ వీటన్నింటికి చెక్ పెట్టేసింది జాతీయ నాయకత్వం. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది. దీంతో మరోసారి గోషామహల్ టికెట్ ఆయనకే ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది.

రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం చూస్తే…. గతంలో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన... 2014, 2018లో మంగళ్‌హాట్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌. దీంతో శాసనసభా పక్ష నాయకుడిగానూ ఎన్నికయ్యారు. ప్రస్తుతం మరోసారి బీజేపీ తరపునే పోటీ చేసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం