Suryapet Crime : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని- భార్య, భర్తలను హత్య చేసిన ప్రియుడు, ప్రేయసి!
28 October 2023, 11:55 IST
- Suryapet Crime : సూర్యాపేటలో వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలి మోజులో భార్యను, అడ్డుగా ఉన్నాడని ప్రేయసి భర్తను హత్య చేశాడో వ్యక్తి.
సూర్యాపేటలో ఇద్దరి హత్య
Suryapet Crime : అక్రమ సంబంధాలు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. సూర్యాపేటలో ప్రియుడు, ప్రేయసి.. మోజుతో కట్టుకున్న వాళ్లను కడతేర్చారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను హత్య చేయగా, మరో ఘటనలో మహిళ భర్తను హత్య చేయించింది. సూర్యాపేటలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన భూక్యా వెంకన్న షేక్ నస్రీన్ అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇద్దరి ఇండ్లలో తెలిసిపోయింది. దీంతో భూక్యా వెంకన్న, నస్రీన్ పెద్ద ప్లాన్ వేశారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న వెంకన్న భార్య, నస్రీన్ భర్తను హత్య చేయడానికి ప్లాన్ వేశారు.
భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా డ్రామా
ఈ ఏడాది జులై 8న భూక్యా వెంకన్న, అతని భార్య రమాదేవితో వారి సొంత ఊరు బళ్లుతండా నుంచి సూర్యాపేటకు వస్తున్నారు. మార్గమధ్యలో బైక్‌ను ఆపిన వెంకన్న ముందు వేసుకున్న పథకం ప్రకారం భార్య రమాదేవిని కర్రతో కొట్టి, తలను కరెంట్ స్తంభానికి బాది అతి కీరాతకంగా హత్య చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు డ్రామా ఆడాడు. రెండు రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్లు నాటకం ఆడాడు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం సద్దుమణిగింది. అందరూ రోడ్డు ప్రమాదంలో వెంకన్న భార్య చనిపోయిందని నమ్మారు.
ప్రియుడితో కలిసి ప్లాన్
దీంతో భూక్యా వెంకన్నకు అడ్డు తొలగిపోయింది. దీంతో నస్రీన్ తో తమ సంబంధాన్ని కొనసాగించాడు. కొంత కాలానికి నస్రీన్ ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. తన భర్త రఫీని కూడా అడ్డుతొలగించమని వెంకన్నను అడిగింది. దీంతో వెంకన్న, నస్రీన్ కలిసి రఫీని హత్య చేసేందుకు పథకం వేశారు. అక్టోబర్ 9వ తేదీన రాత్రి సమయంలో రఫీ ఇంట్లోంచి బయటకు వెళ్లగానే నస్రీన్ వెంకన్నకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. భూక్యా వెంకన్న తన స్నేహితులు అక్కనపల్లి శ్రీశైలం, సారగండ్ల మధుతో కలిసి నస్రీన్ ఇంటికి వచ్చి తలుపు చాటున మాటువేశారు. రఫీ తిరిగి ఇంటికి రాగానే వెంకన్న తన స్నేహితులతో కలిసి రఫీపై దాడి చేసి గొంతు నులిమి చంపేశారు. అనంతరం రఫీ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు డ్రామా ఆడారు. అయితే రఫీ సోదరుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోర్టుమార్టంలో అసలు నిజం వెలుగులోకి!
పోలీసుల విచారణలో భాగంగా రఫీ మృతదేహానికి పోస్టుమార్టం చేయగా, బలవంతంగా గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. నస్రీన్, వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి స్టైల్ లో విచారించగా రెండు హత్యలు బయటపడ్డాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.