తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

27 August 2024, 13:10 IST

google News
    • Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టైన కవిత అప్పటి నుంచి తీహార్‌ జైల్లో ఉంటున్నారు దాదాపు ఐదు నెలలుగా పలు మార్లు బెయిల్‌ కోసం కోర్టుల్ని ఆశ్రయించారు. 
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు (HT_PRINT)

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు

Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసులో జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. కవిత బెయిల్‌ పిటిషన్‌గతంలో పలుమార్లు తిరస్కరణకు గురైంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఛార్జిషీట్లు దాఖలైనందున కవిత బెయిల్ పొందడానికి అర్హురాలని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు కవిత సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని, దాదాపు 16 మొబైల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ పాలసీలో సిబిఐ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసింది. అనంతరం ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులో కవితను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో గత ఐదు నెలలుగా కవిత జైల్లో ఉన్నారు. కవిత బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా చార్జిషీట్లు నమోదు చేసినందున బెయిల్ మంజూరు చేసింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్‌ పిటిషన్‌పై వైఖరి తెలపాలంటూ సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో టీఆర్ ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలపాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, కవితపై ఇప్పటికే రెండు ఏజెన్సీల దర్యాప్తు పూర్తయిందని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

ఈ రెండు కేసుల్లో సహ నిందితుడైన ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు.

కవిత తన మొబైల్ ఫోన్ ను ధ్వంసం చేశారని/ ఫార్మాట్ చేశారని, ఆమె ప్రవర్తన సాక్ష్యాలను తారుమారు చేయడమేనని దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు వాదించారు. కవిత తరపున వాదనలు వినిపించిన ముఖుల్ రోహత్గీ ఈ ఆరోపణను "బూటకపు" గా అభివర్ణించారు.

ఆమె నేరంలో పాల్గొన్నట్లు చూపించడానికి ఆధారాలు ఏమిటి అని ధర్మాసనం రాజును ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.

ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 12న సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది.

ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో కవిత ప్రధాన కుట్రదారు అని పేర్కొంటూ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

కవిత (46)ను మార్చి 15న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న ఆమెను తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని కవిత ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం