NEET Irregularities : బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి యత్నం - 'నీట్' పరీక్ష రద్దుకు విద్యార్థి సంఘాల డిమాండ్
23 June 2024, 19:00 IST
- Students Protest at Union Minister Sanjay Office : కరీంనగర్ లోని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ లో అక్రమాలను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశాయి.
కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం
Students Protest at Union Minister Sanjay Office : నీట్, ఎన్ఈటీ పరీక్షల అవకతవకలపై కరీంనగర్ లో విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బలవంతంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు.
నీట్, ఎన్ఈటి పరీక్షల అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఎన్టీఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో బండి సంజయ్ కార్యాలయానికి పెళ్ళే దారిలో బైఠాయించి ధర్నా చేశారు. కొందరు విద్యార్థులు బండి సంజయ్ ఆఫీస్ ముట్టడించేందుకు దూసుకెళ్ళగా పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థి సంఘాల ప్రతినిధులకు తోపులాటతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థి సంఘాల ప్రతినిధులను అరెస్టు చేశారు. బలవంతంగా లాక్కెళ్ళి వాహనాల్లో ఎక్కించి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. లోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఎన్టీఏను రద్దు చేయాలి..
పేపర్ లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎన్టీఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
నీట్ ఎన్ఈటీ పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో పేపర్లు లీక్ అవుతున్నా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే పేపర్ లీకేజీలపై స్పందించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. అరెస్టు అయిన వారిలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్, ఎన్ఎస్యూఐ ప్రతినిధి అనీల్ తోపాటు 30 మంది ఉన్నారు.
గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న విద్యార్థి సంఘాలు నీట్ ఎనీఈటి పరీక్షల పేపర్ లీక్ తో విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధం విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు పేపర్ లీక్ ను సీరియస్ గా పరిగణిస్తూ విద్యార్థుల పక్షాన ఆందోళన కొనసాగిస్తున్నారు.
బాధ్యులైన వారి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర మంత్రులను రాష్ట్రంలో తిరగనివ్వమని ప్రభుత్వ కార్యక్రమాలను స్తంభింపజేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.