TSRTC Income : టీఎస్ఆర్టీసీ రికార్డ్ - ఒక్కరోజే రూ. 12 కోట్లు ఆదాయం
16 January 2024, 13:01 IST
- TSRTC Latest News: సంక్రాంతి పండగ వేళ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. జనవరి 13వ తేదీన ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఒక్కరోజే రూ 12 కోట్లు ఆదాయం
TSRTC News: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సోంతుల్లకు వెళ్లారు. ఇటు విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా సొంతుల్లకు వెళ్లిపోయారు.ప్రజల తమ సొంత ఊళ్లకు వెళ్ళేందుకు టీఎస్ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. 13వ తేదీన 52.7 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ సంస్థకు ఆ ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది.ఏకంగా రూ.12 కోట్ల ఆదాయం ఒక్క 13వ తేదీనే వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.మరోవైపు మహిళలకు జారీ చేసే జీరో టిక్కెట్లు దాదాపు 9 కోట్లు దాటినట్లు తెలిపారు. ఈనెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, మరియు 13న 31 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు.
పండుగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించిన ఆర్టీసీ.......అందుకు తగ్గ ప్రణాళికలను ముందే సిద్ధం చేసింది.ముందుగా 4484 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని భావించిన ఆర్టీసీ....... ప్రయాణికులు రద్దీ ఎక్కువ ఉండడంతో ఈనెల 11, 12 మరియు 13 తేదీల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 6,261 ప్రత్యేక బస్సులు నడిపినట్లు వారు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయాణికుల్ని వారి గమ్య స్థానాలకు చేర్చుతున్నామని అధికారులు అన్నారు.
ఆర్టీసీ బస్సు పై రాళ్ల దాడి
హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో సోమవారం అర్ధరాత్రి పోకిరిలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు పై రాళ్ల దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఎందుకు దాడి చేస్తున్నారు అని ప్రశ్నించిన బస్సు కండక్టర్, డ్రైవర్ పై కూడా కత్తితో దాడికి యత్నించారు. స్థానికులు ఆ యువకులను ఆపే ప్రయత్నం చేయగా ఎంతకు ఆగలేదు చివరకు వారి అక్కడి నుండి వెళ్ళిపోయారు.సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అసలేం జరిగింది అనేది తెలపాలని చెంగిచేర్ల డిపో మేనేజర్ ను ఆదేశించారు.