TRS: 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం.. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయశక్తి వరకు..
27 April 2022, 5:54 IST
- టీఆర్ఎస్... 21 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా పురుడు పోసుకుంది. సరిగ్గా ఇదేరోజు అంటే.. 21 ఏళ్ల క్రితం ప్రజల ముందుకు వచ్చింది. ఓవైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథాతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అగ్రభాగాన నిలిచింది. 2 సార్లు అధికారాన్ని సొంతం చేసుకుంది.
21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం(ఫైల్ ఫోటో)
21 Years of TRS Party: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)… ఉద్యమ పార్టీగా ఎంట్రీ ఇచ్చింది... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా ముందుకొచ్చింది. ఓ వైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథా...! ఇలా దశాబ్ధానికిపైగా ఎన్నో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. అటుపోటులు ఇలా అన్నింటిని ఎదుర్కొని నిలబడింది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి... దేశ రాజకీయ యవనికపై తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది.
జలదృశ్యం వేదికగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27 కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో పార్టీని ప్రకటించారు కేసీఆర్. టీడీపీకి రాజీనామా ప్రకటించిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. అయితే పార్టీ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టీఆర్ఎస్... పలు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సభలు.. పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాలవ్యాప్తికి ఎంతో కృషి చేసింది.
కాంగ్రెస్ తో మైత్రి.. రాజీనామాల పర్వం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూనే.. మరోవైపు రాజకీయంగా ఎదిగేలా పావులు కదిపింది టీఆర్ఎస్. ఇందులో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసి.. 26 స్థానాల్లో విక్టరీ కొట్టింది. 6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్... ఐదింట్లో గెలిచి విజయబావుటా ఎగరవేసింది. ఇదే సమయంలో హస్తం పార్టీ కేంద్రంలోనూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా పీఠం ఎక్కారు. కొద్దికాలం పాటు సవ్యంగానే సాగింది టీఆర్ఎస్ - కాంగ్రెస్ మైత్రి...! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ.. ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా దేశంలోని 36 పార్టీలు అనుకూలంగా లేఖలు ఇవ్వటంలో టీఆర్ఎస్ పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో జాతీయ నేతలతోనూ కేసీఆర్ సంప్రదింపులు జరుపుతూనే వచ్చారు. కానీ కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ ఏర్పాటు విషయంలో ముందడుగు వేయలేదు. దీన్ని తీవ్రంగా ఖండించిన కేసీఆర్... కాంగ్రెస్ నుంచి బయటికి వస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కేసీఆర్. ఆలె నరేంద్ర రాజీనామాలే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శల వర్షం గుప్పించారు కేసీఆర్.
ఎమ్మెస్సార్ సవాల్.. కరీంనగర్ బైపోల్
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్.. కేసీఆర్ కు ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలవాలన్నారు. అయితే ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గిన గూలాబీ బాస్ కేసీఆర్.. వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తిరిగి పోటీ చేసి... బంపర్ విక్టరీ కొట్టారు. ఈ విజయం టీఆర్ఎస్ చరిత్రలో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. తర్వాత ఎన్నో ఎత్తుగడలను ఎదుర్కొంది టీఆర్ఎస్. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరటం వంటివి చకచక జరిగిపోయాయి.
మహాకూటమితో మరోసారి...
2009 ఎన్నికల్లో రూట్ మార్చారు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని, ఇచ్చిన మాట తప్పిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో చంద్రబాబుతో చేతులు కలిపారు. కాంగ్రెస్ ను ఎదుర్కోనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వామిగా చేరారు. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఈ పార్టీలను కూడా తెలంగాణవాదానికి జై కొట్టేలా చేసిందనటంలో టీఆర్ఎస్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. కానీ ఈ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవి చూసిది టీఆర్ఎస్. కేవలం 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీలతో సరిపెట్టుకుంది.ఇందులో కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. మరోవైపు మహాకూటమి కూడా ఓటమిపాలు కావటం వంటి పరిణామాలు గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పొచ్చు.
అమరణదీక్ష.. రాష్ట్ర ఏర్పాటు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల భర్తీ సమయంలో ఫ్రీజోన్ పై సుప్రీం తీర్పునిచ్చింది. సరిగ్గా ఈ పరిణామమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినట్లు అయింది. ఉద్యోగుల నిరసనలతో ఊపందుకుంది. ఇక్కడే కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. తరువాత కేసీఆర్ అరెస్ట్.. ఖమ్మం తరలింపు.. హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను కంటిన్యూ చేశారు. ఓ వైపు విద్యార్థి లోకం భగ్గుమంది.. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. సీమాంద్ర నేతల రాజీనామాలు.. తెలంగాణ ప్రకటన వెనక్కి.. తెలంగాణ జేఏసీ ఏర్పాటు జరిగిపోయాయి. అప్పటి వరకూ సొంతగా పోరాడిన టీఆర్ఎస్.. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఏసీలో ముందువరుసలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురాగల్గింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించటం.. ఆ ఎన్నికల్లో భారీ విక్టరీ సొంతం చేసుకుంది. ఇలా 2014 వరకు ఉద్యమాన్ని తీసుకువచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎన్నో మలుపుల తరువాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ వచ్చింది. అదే ఏడాది ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో ఒంటరిగా బరిలో దిగిన టీఆర్ఎస్ ... విజయం సాధించింది. ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రైతుల కోసం కీలకమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఇంతలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. అయితే ఇందులో మాత్రం సూపర్ విక్టరీనే కొట్టారు. గతంలో కంటే మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకుంది టీఆర్ఎస్. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది. మరోసారి కూడా కేసీఆరే సీఎంగా పీఠం ఎక్కారు. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ల పూర్తైంది. ఎన్నికలకు దగ్గర పడుతున్న వేళ మళ్లీ వ్యూహాలకు పదనుపెడుతోంది. ఈ క్రమంలో ఇవాళ జరగబోయే ప్లీనరీలో కీలకమైన అంశాలపై చర్చించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించేలా వ్యూహాలు రచించింది.
హైటెక్స్ వేదికగా సభ...తీర్మానాలు ఇవే
ఈసారి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ కీలకమైనదనే చెప్పొచ్చు. రాష్ట్రంలో గతంతో పోల్చితే ఈక్వేషన్స్ మారాయి. బీజేపీ పుంజుకుంది. పలుచోట్ల జరిగిన బైపోల్ లో టీఆర్ఎస్ కు గట్టి షాక్ నే ఇచ్చింది. ఓ దశలో తామే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో ముందుకెళ్లింది. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ యాక్టివ్ అయింది. త్వరలోనే రాహుల్ సభ ఉంది. మరోవైపు టీఆర్ఎస్ గ్రౌండ్ లెవల్ లో సర్వేలు చేపట్టింది. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే చర్చ కూడా జోరుగా వినిపించింది. వీటన్నింటితో పాటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్లీనరీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి వారిలో ఉత్సాహం నింపేలా ప్లీనరీని ఏర్పాటు చేసింది. ఈ సారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని గూలాబీ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో పలు కీలకమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకున్న సర్కార్... మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోందిప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్లీనరీ వేదికగా దిశా నిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న టీఆర్ఎస్... వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా వ్యూహాలు రచించే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
టాపిక్