తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak: గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో 500మందికి పేపర్‌ లీక్..?

Tspsc Paper leak: గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో 500మందికి పేపర్‌ లీక్..?

HT Telugu Desk HT Telugu

20 March 2023, 8:54 IST

google News
    • Tspsc Paper leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పేపర్‌ లీక్ వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ ఏఈ పరీక్షా పత్రాల లీకేజీతో వెలుగులోకి వచ్చిన వ్యవహారంలో, తాజాగా సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు  చేస్తున్నాయి.500మందికి ఈ పేపర్ లీకై ఉంటుందని అనుమానిస్తున్నారు. 
గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పేపర్లు కూడా అమ్మేశారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పేపర్లు కూడా అమ్మేశారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పేపర్లు కూడా అమ్మేశారు.

Tspsc Paper leak: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేస్తున్న రాజశేఖర్‌ రెడ్డి గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షా పత్రాలను పెద్ద ఎత్తున లీక్ చేసినట్లు గుర్తించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసిన ప్రవీణ్, రాజశేఖర్‌ రెడ్డి ముఠా ప్రశ్నాపత్రాలను దాదాపు 500మందికి అందించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో అనుమానితులను ప్రశ్నించేందుకు సిట్ జాబితా రూపొందించింది.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన తొమ్మిది మంది నిందితులతో పాటు మరికొందరి పాత్ర కూడా ఉంటుందని సిట్ భావిస్తోంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో దాదాపు 500మందికి ప్రశ్నాపత్రం చేరి ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. నిందితుల ఫోన్లను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించడంతో ఈ వ్యవహారం బయటపడింది.

టౌన్ ప్లానింగ్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంతో బయటపడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ సిబ్బంది నిర్వాకం, గత ఏడాది అక్టోబర్ నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలపై పడింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఏడు పరీక్షల్లో నాలుగు పరీక్షలను ఇప్పటికే రద్దు చేశారు. మిగిలిన మూడు పరీక్షలపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పేపర్లూ అమ్మేశారు…

మరోవైపు పరీక్షా పత్రాలను ఉంచిన కంప్యూటర్లను నిందితుడు రాజశేఖర్‌ రెడ్డి గత అక్టోబర్‌లోనే తన ఆధీనంలోకి తీసుకున్నట్లు గుర్తించారు. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షల ప్రశ్నా పత్రాలను కూడా సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి సంపాదించినట్లు గుర్తించారు. అక్టోబర్ 16న జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాన్ని నిందితుడు ముందే సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి వరకు గ్రూప్1 పరీక్షలపై ఉన్న సందేహం వీడిపోవడంతో వాటిని రద్దు చేశారు. .

గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం బయట పడకుండా ఉండటానికి ఏఈ, టౌన్ ప్లానింగ్ పరీక్షల ప్రశ్నాపత్రాలు మాత్రమే లీకైనట్లు పోలీసుల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించాడు. గ్రూప్ 1 పేపర్ లీకైనట్లు తెలియడంతో దానిని ఎవరెవరికి విక్రయించాడో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. పరీక్షల్లో 100మార్కులకు పైగా సాధించిన 500మంది జాబితాను సిట్ అదికారులు తయారు చేశారు. వీరిలో నిందితుల గ్రామాలకు చెందిన వారు,కాంటాక్ట్‌లో ఉన్నవారు, అనుమానితుల్ని ప్రత్యేకంగా విచారించనున్నారు.

ప్రశ్నాపత్రాలు పొందిన వారు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్‌లతో ఏమైనా సంప్రదింపులు జరిపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వాట్సాప్‌ ఛాట్‌లను వెలికి తీస్తున్నారు. సిట్‌ అనుమానితుల జాబితాలో కొందరు విదేశాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారని గుర్తించారు. మరోవైపు రాజశేఖర్‌ రెడ్డి గ్రామానికి చెందిన పలువురు గ్రూప్ 1లో మంచి ఫలితాలు సాధించినట్లు గుర్తించారు. పరీక్షల కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి వెళ్లిన వారిలో కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో పోలీసులు వారిని అనుమానిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాలు పొందిన వారిని కూడా కేసులో నిందితులుగా పరిగణించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న దర్యాప్తు…

హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో ఆదివారం 9 మంది నిందితులను వేర్వేరుగా విచారించారు. సిట్‌ అధిపతి ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సైబర్‌క్రైమ్‌ బృందం నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో 9 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరినుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు శనివారం నుంచి 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

తొలిరోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి పొంతనలేని జవాబులు చెప్పినా రెండోరోజు దారిలోకి వచ్చినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన సమాచారం, ప్రశ్నపత్రాలు, దరఖాస్తుదారుల వివరాలు బహిర్గతం చేసేందుకు నిందితులు ఉపయోగించిన మార్గాలపై ఆరా తీశారు. కమిషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల యూజర్‌ఐడీలు మార్చడం, పాస్‌వర్డ్‌లు చోరీ చేయడంలో సహకరించిన వారి గురించి ఆరా తీశారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల్లో ముందుగా ప్రశ్నపత్రాలు లీకు చేయాలనే ఆలోచన ఎవరు చేశారనేది కూపీలాగే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో నిందితులిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కమిషన్‌లో కంప్యూటర్ల వినియోగం, మరమ్మతు, కొత్త సాఫ్ట్‌వేర్‌ తదితర అంశాలపై రాజశేఖర్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. ప్రవీణ్‌ కూడా బీటెక్‌ కంప్యూటర్స్‌ చదవటంతో ఇద్దరికీ సాంకేతిక అంశాలపై పట్టుంది. కంప్యూటర్ల మరమ్మతు ముసుగులో వీరిద్దరూ యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ సేకరించడం, వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవటం తేలికైందని గుర్తించారు.

నిందితుల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సప్‌ ఛాటింగ్స్‌, సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఆధారాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. ప్రశ్నపత్రాలు ఎవరి కంప్యూటర్‌, యూజర్‌ ఐడీ ద్వారా బహిర్గతం అయ్యాయనే దానిపై స్పష్టత రావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం