తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Formation: ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఆట - పాట.. 'తెలంగాణ' చైతన్య పూదోట

Telangana Formation: ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఆట - పాట.. 'తెలంగాణ' చైతన్య పూదోట

31 May 2023, 14:00 IST

google News
    • Telangana Movement Songs 2023: ఆట - పాట... తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అనే ఒక్క మాటలో చెప్పొచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. జై తెలంగాణ నినాదాలు మోగిన ప్రతిచోటా... పాట ప్రస్తావన ఉంది.  సాంస్కృతిక ఉద్యమం తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించిందని చెప్పొచ్చు.
ఆట - పాట.. తెలంగాణకు చైతన్య పూదోట
ఆట - పాట.. తెలంగాణకు చైతన్య పూదోట

ఆట - పాట.. తెలంగాణకు చైతన్య పూదోట

Telangana Formation Day Celebrations 2023:

-రాజిగ ఓరి రాజిగా..

-అమ్మా తెలంగాణమా ఆకలికేకల రాజ్యమా....!

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...

-జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం...

-నాగేటి సాల్లళ్ల నా తెలంగాణ.. నా తెలంగాణ

-రేలా దూలా తాలెల్లాడే నేల నా తెలంగాణ

-వీరులారా వందనం విద్యార్థి... అమరులరా వందనం

-ఆడుదాం డప్పుల్లా దరువేయ్యరా - పల్లె తెలంగాణ పాట పడారా

-రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా..

-ఉస్మానియా క్యాంపస్ లో ఉదయంచిన కిరణమా వీర తెలంగాణమా...

- గడిబిడి చేస్తుండ్రు.. గారడీ చేస్తుండ్రు...

ఇలా ఒకటి కాదు... వేల సంఖ్యలో పాటలు పుట్టుకొచ్చాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దన్నుగా నిలిచాయి. అతిపెద్ద సంస్కృతి ఉద్యమానికి బాటలు పడ్డాయి. 1969 నుంచి నాటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పొచ్చు. పాట లేని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. ఓవైపు రాజకీయ పార్టీలు రాజకీయ పంథాతో ఉద్యమం నడిపిస్తే... ఇక్కడి కవులు, కళాకారులు, రచయితలు తమ కలానికి, గొంతులకు పదును పెట్టారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటి చెప్పారు. రాసిన ప్రతి అక్షరం... ప్రతి పల్లెకు చేరిందంటే తెలంగాణ పాట గొప్పతనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది.

తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ప్రతి పాట సరికొత్త ఊపును తీసుకొచ్చింది. ఉద్యమాన్ని కూడా ఉరకలెత్తించింది. గాయకుడు గొంతెత్తి జై తెలంగాణ అంటే చాలు... సభలో కొలువుదీరిన జనమంతా జై జై తెలంగాణ అంటూ గొంతులు కలిపారు. కాలి గజ్జెల దరువు వినిపిస్తే... సభ అంతా ఊగిపోయేది. రాజిగ ఓరి రాజిగా.. అంటూ గూడ అంజయ్య రాస్తే.. రసమయి బాలకిషన్ పాడిన ఈ పాట ఉద్యమంలో బలంగా వినిపించింది. సభకు అనుగుణంగా జిల్లాలు, ప్రాంతాల పేర్లను ప్రస్తావిస్తూ రాజిగ ఓరి రాజిగా అంటూ పాడుతుంటే జనమంతా కూడా కనెక్ట్ అయిపోయారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా అనే పాట ఇక్కడే కాదు దేశ విదేశాల్లోనూ దద్దరిల్లిపోయింది. ఈరోజు నాటికి కూడా ఆ పాట క్రేజ్ ఒక్క మాటలో చెప్పలేం.

ఇక ప్రత్యేక తెలంగాణ కోసం అసువులు బాసిన వారికోసం దరువు ఎల్లన్న రాసిన వీరులారా వందనం విద్యార్థి... అమరులరా వందనం అతిపెద్ద నివాళిగా చెప్పొచ్చు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త సంబంధం విలువు నీకు తెలియదురా అంటూ అమరవీరుల స్మృతిస్తూ శివుడిని కూడా ప్రశ్నించారు కవి మిట్టపల్లి సురేందర్. ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు కాలిపోతావు రా అంటూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దంటూ మిత్ర రాసిన పాట చాలా మంది విద్యార్థుల్లో ఆలోచనను రేకేత్తించింది. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా అంటూ అభినయ శ్రీనివాస్ రాసిన విద్యార్థి శక్తిని అద్భుతంగా వర్ణించింది. దేశపతి రాసిన సాహిత్యం సినిమాలలో కూడా ఉపయోగించబడింది. నందిని సిద్దా రెడ్డి రాసిన నాగేటి సాల్లాల నా తెలంగాణ అనే ప్రసిద్ధ తెలంగాణ పాటను పాడినందుకు ఉద్యమంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. జై కొట్టు తెలంగాణ అంటూ డా. పసునూరి రవీందర్ ముందుకొచ్చాడు.

ఓ సాయి చంద్, నేర్నాల కిషోర్, అంతడప్పుల నాగరాజు, మధుప్రియా, తేలు విజయ, పల్లె నర్సింహ్మా, నిస్సార్ ఇలా ఒక్కరు కాదు.... తెరపైకి రాని ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఈ సాంస్కృతి ఉద్యమంలో భాగమయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు, గుండెగుండెకు తీసుకొనిపోయి ఉద్యమ భావజాలాన్ని విస్తరించారు. ఈ పాటలు సామాన్య జనాన్ని ప్రభావితం చేసి.. ఉద్యమానికి బలాన్ని చేకూర్చాయని చెప్పటంలో ఎలాంటి సందేహాం లేదు. కొన్ని వందల, వేల పాటలు ఉద్యమ చైతన్యంలో భాగంగా పుట్టుకువచ్చి తెలంగాణ సమాజాన్ని ఉద్యమంవైపు మరల్చాయి. ఇక ఉద్యమ రథసారథిగా ఉన్న కేసీఆర్ కూడా పలు పాటలు రాయటం విశేషం. చూడు చూడు నల్గగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్ బండా అంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా నీటి కష్టాలను ప్రస్తావించారు. జై బోలో తెలంగాణలో కూడా ఒకటి రెండు పాటలు కూడా రాశారు.

ఇలా తెలంగాణ ఉద్యమంలో పాటకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పొచ్చు. ఓవైపు వలస పాలనలోని తెంగాణ దీనత్వాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల దిగజారిపోయిన బతుకులను చిత్రించాయనే అనొచ్చు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాటకు పట్టం కట్టే ప్రయత్నం కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథిని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 500 మందికిపైగా ఉద్యోగాలను కూడా ఇచ్చింది.

తదుపరి వ్యాసం