Peddapur Gurukulam: పెద్దాపూర్ గురుకులంలో స్టూడెంట్‌కు పాము కాటు... ప్రిన్సిపల్ సస్పెన్షన్..
20 December 2024, 8:13 IST
- Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయం నెలకొంది.నాలుగు మాసాల క్రితం ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం కలకలం సృష్టించింది.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ ఆందోళన
Peddapur Gurukulam: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జరుగుతున్న వరుస ఘటనలతో విద్యార్థులు, పేరెంట్స్ ను భయాందోళనకు గురి చేస్తున్న పాముల భయం చివరకు ప్రిన్సిపల్ సస్పెన్షన్ కు దారి తీసింది. పాములు కోతుల బెడద నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. పిల్లలను ఇంటికి తీసుకెళ్ళడంతో గురుకుల పాఠశాల ఖాళీ అయింది.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటే ఇప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్ భయపడే పరిస్థితి ఏర్పడింది. నాలుగు మాసాల క్రితం ఆగష్టులో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 8వ తరగతి విద్యార్థి ఓంకార్ అఖిల్ పాముకాటుతో ఆసుపత్రిలో చేరాడు. అది జరిగి 12 గంటలు గడవక ముందే మరో విద్యార్థి బోడ యశ్వంత్ ఆసుపత్రి పాలయ్యాడు. ఇద్దరు కోరుట్ల ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
అఖిల్ కుడి చేతి రిస్ట్ వద్ద రెండు కాట్లు ఉండగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ పింజర పాము సింటమ్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. 24 నుంచి 36 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని తెలిపారు. యశ్వంత్ కు కాలుకు చేతికి రెండు చోట్ల కాటులా ఉన్నప్పటికీ ఏమి కుట్టిందో తెలియదని చెప్పడంతో భయంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు ప్రకటించారు.
స్టూడెంట్స్.. పేరెంట్స్ ఆందోళన..
పాము కాటు అనుమానంతో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చేరినప్పటికీ ఎవ్వరికీ మాత్రం పాము కనిపించలేదు. ఆ విద్యార్థులు సైతం ఏం కుట్టిందో కూడా తెలియదని అంటున్నారు. వారం రోజుల క్రితం పాము కనిపించిందని విద్యార్థులు చెబుతున్నారు. గతంలో ఇద్దరు మృతి చెందడంతో పేరెంట్స్ భయాందోళన చెందుతున్నారు. పేరెంట్స్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు గురుకుల పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు.
అధికారుల పర్యవేక్షణ లోపం, గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు పాముకాటుకు గురై ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని అధికారులను నిలదీశారు. గురుకులం ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు సముదాయించి ఆందోళన విరమింప చేశారు.
ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్...
పాముల భయంతో విద్యార్థులు ఇద్దరు ఆసుపత్రి పాలు కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ గురుకుల పాఠశాలను సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. పాములు మాత్రం కనిపించలేదని ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు సేఫ్ గా ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వెంటనే పూడ్చివేస్తామని తెలిపారు. అనుమతి లేకుండా ప్రిన్సిపల్ మాధవిలత సెలవు పెట్టడాన్ని కలెక్టర్ సీరియస్ గా పరిగణిస్తూ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
గురుకుల పాఠశాల ఖాళీ...
విద్యార్థులు పాము కాటుకు గురైతే ప్రిన్సిపల్ తోపాటు సిబ్బంది సరిగా స్పందించడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం చేయించకుండా టాబ్లెట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గురుకుల పాఠశాలలో తమ పిల్లలను ఉంచలేమని భయాందోళనతో పేరెంట్స్ పిల్లలను ఇంటికి తీసుకెళ్ళారు. దీంతో గురుకుల పాఠశాల ఖాళీ అయింది. ఓ వైపు విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవడం, ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం, ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ వేటు పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మాజీ ఎమ్మెల్యే అరెస్టు...
పాము కాటుతో నాలుగు మాసాల క్రితం ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడంతో బిఆర్ఎస్ నిరసన ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ విద్యార్థులు పేరెంట్స్ తో కలిసి ఆందోళనకు దిగారు. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించి గురుకుల పాఠశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం గురుకుల పాఠశాల పరిస్థితిని మెరుగుపరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.