TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ అలర్ట్… ఆరు కొత్త కేసులు నమోదు
21 December 2023, 8:00 IST
- TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. బుధవారం ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణలో కొత్త కోవిడ్ కేసుల నమోదు
TS Covid Updates: దేశ వ్యాప్తంగా అలజడి రేపుతున్న కోవిడ్ తెలంగాణలో కూడా వెలుగు చూసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 06 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో 42 మందికి సంబంధించిన రిపోర్ట్స్ వెలువడాల్సి ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 14 మంది కొవిడ్ చికిత్సలు పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలో బుధవారం ఒక్కరోజే 614 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 3 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర గణంకాలు వెల్లడించాయి.
తెలంగాణలో కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందుతన్న వారిలో ఒకరు పూర్తిగా కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ చావులు నమోదు కాలేదు. కోవిడ్ కేసుల్లో రికవరీ రేటు 99.51శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఒక్క గోవాలోనే 14 మంది కోవిడ్ బారిన పడ్డారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో ఇప్పటి వరకూ 14 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖ ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే కొత్తగా మరో ఆరు కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ పరిదిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్ పాజిటివ్ వచ్చి తీవ్రమైన లక్షణాలతో ఉన్న రోగులు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, రోగులకు అవసరమైన సదుపాయాలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.