తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siricilla Police: సిరిసిల్ల జిల్లా పోలీసుల సరికొత్త వ్యూహం, పేకాట రాయుళ్ళ ఆట కట్టించిన పోలీసులు

Siricilla Police: సిరిసిల్ల జిల్లా పోలీసుల సరికొత్త వ్యూహం, పేకాట రాయుళ్ళ ఆట కట్టించిన పోలీసులు

HT Telugu Desk HT Telugu

08 July 2024, 9:00 IST

google News
    • Siricilla Police: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అసాంఘీక చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు వేషం మార్చారు.
పేకాట రాయుళ్లను పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు
పేకాట రాయుళ్లను పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు

పేకాట రాయుళ్లను పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు

Siricilla Police: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అసాంఘీక చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు వేషం మార్చారు. పోలీస్ యూనిఫామ్ కనిపించకుండా సామాన్య వ్యక్తులుగా తల పాగ చుట్టి... లుంగీలు ధరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను గమనించి పరార్ అవుతున్న నేపథ్యంలో మారు వేషంలో పేకాట రాయుళ్ళ ఆట పట్టించారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో జోరుగా జూదం ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.

అయితే సాధారణంగా పోలీసులు యూనిఫామ్స్ కనిపించగానే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారు పరార్ అవుతారని భావించిన పోలీసులు కూలీల వేషం వేసుకుని వెళ్లారు. బదనకల్ గ్రామ శివార్లలో సాగుతున్న పేకాట స్థావరాలను కట్టడి చేయాలని భావించిన సీఐ మొగిలి సరికొత్త స్కెచ్ వేశారు.పేకాటరాయుళ్ల అడ్డాలను గుర్తించి తమ సిబ్బందిని మారు వేషంలో వెళ్లాలని ఆదేశించారు.

కూలీలుగా పేకాట స్థావరానికి చేరిన పోలీసులు

సిఐ ఆదేశంతో ముస్తాబాద్ పోలీసులు లుంగీలు కట్టుకుని తలకు రుమాలు చుట్టుకుని వెల్లడంతో పేకాట రాయుళ్లు పొలాల్లో పనిచేసే కూలీలుగా భావించారు. జూదం ఆడడంలో మునిగిపోయారు. పోలీసులు వారిని సమీపించి చుట్టు ముట్టముట్టే వరక జూదగాళ్లకు అర్థం కాలేదు. వచ్చింది కూలీలు కాదు... పోలీసులని గ్రహించే లోపే పోలీసులు పేకాట స్థావరాన్ని కవర్ చేయడంతో అక్కడ గేమ్ ఆడుతున్న జూదగాళ్లు పోలీసులకు చిక్కక తప్పలేదు. పేకాట రాయుళ్ల నుండి కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.

సంచలనంగా మారిన పోలీసుల తీరు..

ముస్తాబాద్ మండలంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గేమింగ్ యాక్టు అమలు చేసేందుకు పోలీసులు వేసిన ఈ ప్లాన్ గురించి విన్న వారంతా భలేగా వ్యవహరించారు పోలీసులు అని కామెంట్ చేస్తున్నారు. గతంలో పోలీసులు మారు వేషాల్లో సంచరించిన సందర్భాలు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మాత్రం అమలు చేసిన వారు లేరనే చెప్పాలి.

నేరాల్లో పాల్గొని తప్పించుకుని తిరుగుతున్న ఘరానా నేరస్తుల కోసం, నక్సల్స్ ఆచూకి కోసం పోలీసులు వేషధారణ మార్చి వారి ఆచూకి కోసం ప్రయత్నించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పోలీసులు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన సందర్భాలు మాత్రం లేవు. తాజాగా ముస్తాబాద్ పోలీసులు అనుసరించి తీరు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం